Dhandoraa OTT | తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, కుల వివక్ష వంటి సున్నితమైన సామాజిక అంశంతో తెరకెక్కిన ‘దండోరా’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై, విడుదలకి ముందు నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. అయితే థియేటర్లలో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం నేటి నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా.. మురళీకాంత్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని తుళ్లూరు అనే గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరిలో కుల వివక్ష వేళ్లూనుకుపోయి ఉంటుంది. ఎంతలా అంటే, తక్కువ కులానికి చెందిన వారు మరణిస్తే వారి అంత్యక్రియలు కూడా ఊరికి దూరంగా, ఎవరికీ కనిపించని చోట నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అగ్ర కులానికి చెందిన రైతు శివాజీ (శివాజీ) హఠాత్తుగా మరణిస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన శవాన్ని అగ్రకుల స్మశాన వాటికలో దహనం చేయడానికి వీల్లేదని ఆ కుల పెద్దలు అడ్డుతగులుతారు. దీంతో తన తండ్రికి గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహించాలని కొడుకు విష్ణు (నందు), కూతురు సుజాత (మనికా చిక్కాల), ఊరి సర్పంచ్ (నవదీప్) కలిసి పోరాటం మొదలుపెడతారు. అయితే సొంత కులమే శివాజీని ఎందుకు వెలివేసింది? తక్కువ కులానికి చెందిన రవి (రవికృష్ణ) హత్యకు, ఈ కుల రాజకీయాలకు సంబంధం ఏంటి? వేశ్య శ్రీలత (బిందుమాధవి) పాత్ర శివాజీ జీవితాన్ని ఎలా మార్చింది? చివరికి శివాజీ అంత్యక్రియలు సజావుగా సాగాయా లేదా? అనేదే మిగతా కథ.
#Dhandoraa (Telugu)
Now streaming on Primevideo in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/HHgfmM4Ui4
— OTT Trackers (@OTT_Trackers) January 14, 2026