యాదాద్రి భువనగిరి, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అమృత్ 2.0 పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. పట్టణాల్లో వీటి పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉన్నాయి. మార్చి నాటికే అందుబాటులోకి రావల్సి ఉండగా, పలు చోట్ల ఇంకా 50 శాతం పనులు కూడా పూర్తికాలేదు. ట్యాంకులు, పైపులైన్లు, ఇంటి కనెక్షన్లు మాటలకే పరిమితమవుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, జాప్యానికి తోడు అధికారులు పట్టించుకోవడంతో అమృత ధార అందని ద్రాక్షగానే మారుతున్నది.
అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) 2.0 మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి పట్టణాభివృద్ధి పథకం. పట్టణాల్లో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందించడం, మురుగు వ్యవస్థను మెరుగుపరడచం దీని ము ఖ్య లక్ష్యం. అంతర్గత పైపులైన్లు, కొత్త ట్యాంకులు ని ర్మించి.. పాత మంచినీటి పథకాలకు అనుసంధానం చేయడంతోపాటు ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలి. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, చౌ టుప్పల్, పోచంపల్లి మున్సిపాలిటీల్లో అమలు చేశారు. ఆరు మున్సిపాలిటీల్లో రూ. 121.3 కోట్ల మంజూరయ్యాయి. 2024 ఆగస్టు 14న పనులు ప్రారంభించా రు. పలు చోట్ల మంచి నీటి పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాంక్‌లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. రెండేండ్లు కావొస్తున్నా అవి నిర్మాణ దశలోనే ఉ న్నాయి. మార్చి నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. మార్చినెలలో సగం రోజులు గడిచినా చాలా చోట్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ట్యాంక్‌లు, పైపులైన్ పనులే పూర్తి కాలేదు. ఇక ఇంటి కనెక్షన్ ఎప్పుడిస్తారో అని జనం ఎదురు చూస్తున్నారు.
భువనగిరి.. భువనగిరి మున్సిపాలిటీలో 15.13 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. మూడు ట్యాంకుల పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రగతి నగర్లో 1500 కిలో లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మాణంలో భాగంగా అడుగు భాగం స్టీల్ ఫ్యాబ్రికేషన్ పనులు కొనసాగుతున్నాయి. సింగన్నగూడెం వద్ద వెయ్యి కిలో లీటర్లతో నిర్మిస్తున్న ట్యాంకు రెండో దశలో, రాయగిరి వద్ద 300 కిలో లీటర్ల ట్యాంకు పనులు నడుస్తున్నాయి. రెండుకిలో మీటర్ల ఫీడర్ పైపులైన్‌కు గాను 0.5 కి.మీ, 31 కి.మీ. డిస్ట్రిబ్యూషన్ లైన్‌కు గాను.. 19.39 కి.మీ. మాత్రమే వేశారు.
యాదగిరిగుట్ట.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన గుట్ట మున్సిపాలిటీలో రూ. 27 కోట్లతో పనులు చేపట్టారు. ఇప్పటి వరకు రూ. 6 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. మూడు వాటర్ ట్యాంకులను పనులు ప్రారంభించగా, ఇంకా 50 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 60 కిలోమీటర్ల మేర పైపులైన్ల పనులకు గాను 40 కి.మీ. మేర పూర్తి చేశారు. ఇంకా 20 కి.మీ. పనులు చేపట్టాల్సి ఉంది.
భూదాన్‌పోచంపల్లి.. పోచంపల్లి మున్సిపాలిటీలో 17.50 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ట్యాంకు నిర్మాణ పనులు మూడు బీముల వరకు పూర్తయ్యాయి. 5లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు నిర్మాణ దశలో ఉంది. 35 కి.మీ. మేర పైపులైన్ వేయాల్సి ఉండగా, మహమ్మాయి కాలనీ, పద్మానగర్, జేవీ కాలనీల్లో 24కి.మీ. మేర వేశారు. మెయిన్ లైన్ 5 కి.మీ. కాగా, 1.5 కి.మీ వేశారు.
మోత్కూరు.. ఇక్కడ రూ.12 కోట్ల అంచనా వ్యయంతో పనులకు స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ట్యాంకుల నిర్మాణ పనులు పిల్లర్ల స్థాయిలోనే ఉన్నాయి. పైపులైన్ నిర్మాణ పనులను సుమారు 5 కి.మీ. మేర చేపట్టాల్సి ఉండగా, ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్లు పనుల విషయంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
చౌటుప్పల్.. చౌటుప్పల్‌కు అమృత్ 2.0 పథకం కింద రూ. 21 కోట్లు మంజూరయ్యాయి. 24 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో చౌటుప్పల్‌లో రెండు, తంగడపల్లిలో ఒకటి, లక్కారంలో ఒకటి చొప్పున ట్యాంకులు పిల్లర్ల దశలోనే ఉన్నాయి. 29కి.మీ. మేర పైపులైన్ వేయాల్సి ఉండగా, నాలుగు కి.మీ. మేర మాత్రమే పనులు చేపట్టారు. ఇంకా 25 కి.మీ. పెండింగ్‌లో ఉన్నాయి.
ఆలేరు.. ఆలేరులో రూ. 12 కోట్ల వ్యయంతో జూనియర్ కళాశాల, పాత మున్సిపల్ కార్యాలయంలో వాటర్ ట్యాంకు నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నాయి. బహదూర్‌పేట చెరువు సుందరీకరణ కోసం రూ. మూడు కోట్లు కేటాయించారు. కేవలం 20శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి.