Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం (Union Govt) నీట్ పరీక్ష (NEET exam) ను రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత, లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తంచేశారు. దాదాపు 22 లక్షల మందికిపైగా విద్యార్థులు పడిన కష్టం, వారు కన్న కలలు బీజేపీ (BJP) సారథ్యంలోని అవినీతి వ్యవస్థవల్ల ఛిన్నాభిన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ తన అధికారిక ‘ఎక్స్ (X)’ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. తన ఎక్స్ ఖాతాలో రాహుల్‌గాంధీ ఏమని రాసుకొచ్చారంటే..!
‘నీట్ పరీక్ష రద్దయ్యింది. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికిపైగా విద్యార్థుల కఠోర శ్రమ, త్యాగాలు, కలలు ఛిన్నాభిన్నమయ్యాయి. పిల్లల చదువు కోసం కొందరి తల్లిదండ్రులు రుణాలు తీసుకున్నారు. కొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారు. లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం ఎన్నో రాత్రులు మేల్కొని ఉండి చదివారు. అందుకు వారికి దక్కిన ప్రతిఫలం ఏమిటంటే.. పేపర్ లీకేజీలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యా వ్యవస్థలో వ్యవస్థీకృతమైన అవినీతి. ఇది కేవలం వైఫల్యం కాదు. దేశ యువత భవిష్యత్తుపై జరిగిన నేరం. ప్రతిసారి పేపర్ మాఫియా ఎలాంటి శిక్షల్లేకుండా తప్పించుకు తిరుగుతుంటే.. నిజాయతీపరులైన విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారు’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
ఇప్పుడు అదే లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి, ఆర్థికపరమైన భారం, అస్థిరతను భరించాల్సి వస్తోందని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఒకరి తలరాతను వారి శ్రమతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తుంటే ఇక విద్యకు నిజమైన అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చెబుతున్న ‘అమృత్ కాలం’ ఇప్పుడు ‘విష కాలం’ గా మారిందని ఎద్దేవా చేశారు. నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఈ నెల 3న జరిగిన పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ఈ రద్దుపై పలు పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.