తుంగతుర్తి, మే 11 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో విద్యార్థులకు ఏం చేశారని విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ప్రశ్నించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టినందుకా, లేక విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీలు, విద్యా భరోస కార్డు ఇస్తామని ఎగ్గొట్టినందుకా, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు విషాహారం తిని చనిపోయినందుకా విద్యా వారోత్సవాలు అని ఆయన ఎద్దేవ చేశారు. విద్యార్థులకు ఇస్తానని హామీలు అమలు చేయకుండా వారోత్సవాల పేరుతో కాలయాపన చేయడం ప్రజా ధనాన్ని లూటీ చేయడం సరికాదని మండిపడ్డారు.