డాక్టర్ మంత్రి విజయలక్ష్మి. ఉమ్మడి జిల్లాలోనే కాదు. రాష్ట్రంలోనే ప్రముఖంగా పేరుగాంచిన సీనియర్ గైనకాలజిస్టు. ఈమె పేరు చెబితే గుర్తు పట్టని వాళ్లు ఉండరు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. కష్ట పడి వైద్య విద్యను అభ్యసించి అనతి కాలంలోనే మంచి గైనకాలజిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో సంజీవని చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి మూడేళ్లలోనే 30కిపైగా క్యాంపులు ఏర్పాటు సామాజిక సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణులకు ఆమె ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. కరోనాకు ముందు తన నర్సింగ్ హోంకు వచ్చిన గర్భిణులకు ఉచితంగా పౌష్టికాహారాన్ని ప్రతిరోజూ అల్పాహారంగా అందించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తున్న ఆమెకు ఐఎంఏలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది.
మధ్య తరగతి కుటుంబంలో పుట్టి వైద్య విద్యను అభ్యసించేందుకు నా జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మా నాన్న ప్రోత్సాహంతో మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నత విద్యను అభ్యసించా. నా చదువు కోసం నా కుటుంబ సభ్యులు మొత్తం సాక్రిఫై చేయాల్సి వచ్చింది. ఇక సొంతంగా దవాఖానను స్థాపించుకునే పరిస్థితి లేక నేను, నా భర్త కొంత కాలం ఇతర నర్సింగ్ హోంలలో పనిచేశాం. కరీంనగర్లో సంజీవని నర్సింగ్ హోం స్థాపించినప్పుడు మా చేతిలో చిల్లి గవ్వ లేదు. వృత్తిని, మా పని తనాన్ని నమ్ముకుని ధైర్యంగా అడుగేశాం. ఇప్పుడు చాలా మంది గర్భిణులు నా వద్దకు వస్తుంటారు. వారిని నా బిడ్డల్లా చూసుకుంటాను. అందుకే నన్ను చాలా మంది డాక్టర్ అని కాకుండా అమ్మా అని పిలుస్తారు. సోషల్ యాక్టివిటీ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. భవిష్య తల్లులుగా భావించే కౌమార బాలికలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్య వంతమైన సమాజానికి పునాదులు పడతాయి. ఈ భావనతోనే అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత క్యాంపులు నిర్వహించి వాళ్లకు సేవలందిస్తున్నా. నా వద్దకు రాలేని గర్భిణుల వద్దకు నేనే వెళ్లి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, టానిక్లు, విటమిన్స్ అందిస్తుంటాం. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తోంది.
కరీంనగర్, మార్చి 5 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: విజయలక్ష్మి సేవలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందాయి. ఢిల్లీలోని బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్లు 2019లో మెడికల్ ఎక్సలెన్స్ అవార్డును ఇచ్చి గౌరవించారు. అదే ఏడాది రతన్ సంస్థ వాళ్లు కూడా గోల్డ్ మెడల్ అవార్డును ప్రదానం చేశారు. బెంగళూర్లో జరిగిన జాతీయ ఐఎంఏ సదస్సులో ఇన్స్పైరింగ్ గైనకాలజిస్టు అవార్డును దక్కించుకున్నారు. జనగామ, కరీంనగర్, హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి ఐఎంఏ కాన్ఫరెన్స్లో వరుసగా మూడు సార్లు బెస్ట్ చైర్ పర్సన్ అవార్డులు దక్కాయి. ఆమె అందించిన సోషల్ సర్వీసు మణికిరీటంలాంటి అవార్డుగా చెప్పుకొనేందుకు వీలుగా జాతీయ స్థాయిలో బెస్ట్ సోషల్ యాక్టివిటీ కింద ఐఎంఏ నేషనల్ ప్రెసిడెంట్ జయలాల్ చేతుల మీదుగా ఒక ప్రత్యేక అవార్డును అందుకున్నారు. 2020-21గాను ఐఎంఏ అప్రిషియేన్ అవార్డు ఫర్ ఉమెన్ పేరుతో నేషనల్ ఐఎంఏ ఈ అవార్డును అందించింది.