న్యూఢిల్లీ, నవంబర్ 17: నవతరం క్నాలజీ స్టార్టప్ కంపెనీల ఐపీవోలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చిన్న ఇన్వెస్టర్లను పరిరక్షించే లక్ష్యంతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ లిస్టింగ్ నిబంధనల్లో పలు మార్పుల్ని ప్రతిపాదించింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవోలు) ద్వారా సమీకరించిన నిధుల్ని కంపెనీలు ఎలా
ఖర్చుచేయాలి? ఆయా కంపెనీల్లోని పెద్ద ఇన్వెస్టర్లు ఐపీవోల్లో ఎంత వాటా అమ్ముకోవాలి? యాంకర్ ఇన్వెస్టర్లు ఎంతకాలంలోగా ఎగ్జిట్ కావొచ్చు? ఇటువంటి అంశాలకు సంబంధించిన నిబంధనల్ని కఠినతరం చేయాలని సెబీ నిర్ణయించింది. ఐపీవోలకు 2021 రికార్డు సంవత్సరంగా నిలిచిన ఈ ఏడాది స్టార్టప్ ఐపీవోలైన జొమాటో, నైకాలు లిస్టింగ్ రోజునే రెట్టింపు లాభాలివ్వడంతో ఇంటర్నెట్ కంపెనీలపై ఇన్వెస్టర్ల మోజు అంతకంతకూ పెరుగుతోంది.
ఇండియాలో అతిపెద్ద ఐపీవో అయిన పేటీఎం ఈ వారాంతంలో లిస్ట్కానున్నది. ఈ తరుణంలో సెబీ తాజా ప్రతిపాదనల్ని చర్చాపత్రంగా విడుదల చేస్తూ, వాటిపై మార్కెట్ వర్గాల వ్యాఖ్యల్ని నవంబర్ 30లోగా సమర్పించమని కోరింది. లిస్టింగ్ నిబంధనల్లో ప్రతిపాదించిన మార్పులివి…
ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్ని ఖర్చుచేసే లక్ష్యాన్ని కంపెనీలు స్పష్టంగా చెప్పకపోతే, నిధుల వినియోగంపై పరిమితిని సెబీ ప్రతిపాదించింది. ఐపీవో నిధుల్ని భవిష్యత్ టేకోవర్లకు, వృద్ధి అవకాశాల కోసం ఖర్చుచేయనున్నట్లు జొమాటో, పాలసీ బజార్, పేటీఎంలు ఐపీవో ప్రాస్పెక్టస్‌లో పేర్కొన్నాయి. ఇవి లక్ష్యాల్ని స్పష్టంగా చెప్పలేదు. ప్రస్తుత లిస్టింగ్ నిబంధనల ప్రకారం ఐపీవో నిధుల నుంచి టేకోవర్లపై చేసే వ్యయంపై పరిమితి లేదు. ప్రత్యేకించి లక్ష్యాన్ని స్పష్టంచేయకుండా, సాధారణ కార్పొరేట్ అవసరాలకు (జీసీపీ) 25 శాతం ఐపీవో నిధుల్ని వాడుకునే అవకాశం ఇప్పుడు కార్పొరేట్లకు ఉంది. కొత్త మార్కెట్లోకి ప్రవేశించడానికి, కస్టమర్లను సంపాదించుకోవడానికి, సంస్థల్ని చేజిక్కించుకోవడానికి నిధుల్ని ఉపయోగిస్తామంటూ నవతరం టెక్నాలజీ కంపెనీలు చెపుతుంటాయి. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం 35 శాతం ఐపీవో నిధుల్నే టేకోవర్లు, జీసీపీలకు కంపెనీలు వినియోగించాల్సిఉంటుంది. కానీ ఏ సంస్థను ఎంత మొత్తానికి టేకోవర్ చేయాలనుకుంటున్నారు? జీసీపీ అవసరాలేమిటో స్పష్టంగా పేర్కొంటే నిధుల వినియోగంపై పరిమితి ఉండదు.
ఆయా కంపెనీల్లో పెద్ద వాటాదారులు వారి మొత్తం వాటాలో 50 శాతం వరకూ మాత్రమే ఐపీవోల్లో విక్రయించుకోవాలి. ఏదైనా కంపెనీలో 20 శాతానికి మించి వాటా ఉన్నవారిని ‘పెద్ద షేర్‌హోల్డరు’గా పరిగణిస్తారు. ఈ షేర్హోల్డర్లకు ఐపీవో తర్వాత 6 నెలల లాక్ ఇన్ పిరియడ్ కూడా ఉంటుంది. వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, అల్ట్రనేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కూడా పెద్ద షేర్‌హోల్డర్ల కోవలోకి వస్తాయి.
ఐపీవోలో పెట్టుబడిచేసే యాంకర్ ఇన్వెస్టర్లు వారి షేర్లలో 50 శాతంపై సెబి లాక్ ఇన్ పిరియడ్ పెంపును ప్రతిపాదించింది. యాంకర్ ఇన్వెస్టర్లు వారివద్దనున్న సగం షేర్లను లిస్టింగ్ తేదీ నుంచి 90 రోజుల తర్వాత మాత్రమే విక్రయించుకోవాల్సిఉంటుంది. ఇప్పటివరకూ ఈ పరిమితి 30 రోజులుగా ఉంది.