Immigration Games | న్యూఢిల్లీ, మే 17: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఖైదీలందరినీ ఒక ఐలాండ్‌లోకి తీసుకెళ్తారు.. వాళ్లను టీమ్‌లుగా విభజించి పోటీలు పెడతారు.. చివరగా గెలిచినవారిని జైలు నుంచి విడుదల చేస్తారు.. ఈ కాన్సెప్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా అనేక సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. అమెరికా విదేశాంగ శాఖ ఇదే తరహాలో ఒక రియాలిటీ షో నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నది. వలసదారులకు పోటీలు నిర్వహించి, గెలిచినవారికి అమెరికా పౌరసత్వం ఇచ్చేలా దీనికి రూపకల్పన చేశారు.
ఈ విషయాన్ని అమెరికాకు చెందిన హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) శుక్రవారం ధృవీకరించింది. అయితే ఈ ప్రతిపాదనలకు ఇంకా పూర్తిస్థాయి ఆమోదముద్ర పడలేదని అధికారులు చెప్తున్నారు. ఇది హంగర్ గేమ్స్ తరహాలో ఒకరినొకరు దాడి చేసుకునేలా, హింసాత్మకంగా ఉండదని చెప్పారు. అదే సమయంలో ఓడిపోయిన వారిని వారి దేశాలకు తిప్పి పంపే ప్రతిపాదన కూడా లేదన్నారు.
గనుల్లో తవ్వి బంగారం వెలికి తీయడం (గోల్డ్ రష్), వాహనాలు మరమ్మతులు చేయడం వంటి బృంద కార్యకలాపాలు ఉంటాయని చెప్పారు. మొదట వలసదారుల్లో తాత్కాలిక రక్షణ హోదా (టీపీఏ) పొందినవారితో ఈ రియాల్టీ షో చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఏ దేశ పౌరులైనా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి తమ దేశంలో యుద్ధ పరిస్థితులు, ఉపద్రవాలు, ఇతర రక్షణపరమైన కారణాలను చూపుతూ రక్షణ కోరితే టీపీఎస్ మంజూరు చేస్తారు. ఈ విధానానికి చరమ గీతం పాడాలని ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచీ ఆలోచిస్తున్నది.