యాసంగి పనులు జోరందుకున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా వరిని వేయాలని అధిక శాతం రైతులు భావించారు. అయితే, కేంద్రం బాయిల్డ్ రైస్ కొనేది లేదని తేల్చి చెప్పడంతో వరి స్థానంలో ఇతర పంటలను సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. ఇందుకోసం ప్రతీ గ్రామంలో వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పది మంది రైతులు ఒక్కచోట ఉంటే అక్కడికిపోయి వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఏ పంటలు వేస్తే లాభం ఉంటుంది. ఏ పంటకు ఎంత ఖర్చవుతుంది.. దిగుబడి ఎంత వస్తుంది.. డిమాండ్ దేనికి ఉంది.. మార్కెట్ సౌకర్యం ఇలా ప్రతీ అంశాన్ని రైతులకు వివరిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 15 శాతం మేర ఇతర పంటలు వేశారు. అవసరమైన ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతున్నది. కేంద్ర నిర్ణయంతో యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఎవరైనా రైతులు వరిని పండిస్తే నష్టపోతారని, పంటల మార్పిడి పాటించాలని, ఇతర పంటలను సాగుచేస్తే అధిక దిగుబడి రావడంతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
యాసంగిలో వరికి బదులు ఇతర పంటల సాగుచేసేలా గ్రామగ్రామానా రైతులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఏ పంటలను సాగుచేస్తే లాభం ఉంటుంది. ఏ పంటకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత దిగుబడి వస్తుంది.. ఏఏ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.. ఇలా ప్రతీ పంట సాగు గురించి వివరిస్తూ ఇతర పంటలు సాగుచేసేలా రైతాంగాన్ని అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంది. మార్కెట్ సౌకర్యం ఎలా ఉంటుంది లాంటి వివరాలను రైతు వేదికల్లో తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయమని చేతులెత్తేయడంతో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచిస్తున్నది. ఆ దిశగా విత్తనాలు, ఎరువులు, సమకూరుస్తున్నది. యాసంగికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో 15శాతం మేర ఇతర పంటలు వేశారు. యాసంగిలో పంటల మార్పిడి, ఇతర పంటలను సాగుచేస్తే అధిక దిగుబడి రావడంతో పాటు మంచి ఆదాయం సమకూరనున్నది.
సిద్దిపేట, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు యాసంగి సాగు పనుల్లో బిజీ అయ్యారు. డిసెంబర్, జనవరి నెలలో పంటలను సాగుచేస్తుంటారు. గతంలో ఎక్కువగా వరి సాగుచేసిన రైతులు.. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ప్రస్తుతం ఇతర పంటలను సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా మొక్కజొన్న, స్వీట్‌కార్న్, పెసర, మినుములు, కంది, పల్లికాయ, ఆముదం, పొద్దుతిరుగుడు, జొన్న, కుసుమ, నువ్వులు తదితర ఇతర పంటలతో పాటు వివిధ కూరగాయలను సాగుచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం రైతులు వానకాలం ధాన్యాన్ని అమ్ముకునే పనిలో ఉండడంతో యాసంగి సాగు కొంత ఆలస్యం అవుతున్నది. కాగా, రెండు, మూడేండ్లలో ఎంత మేర అయితే పొద్దు తిరుగుడు సాగుచేశారో ఈసారి కూడా ఆ మేరకే అధికారులు విత్తనాలను సిద్ధం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని తేల్చడంతో పలువురు రైతులు పొద్దు తిరుగుడు సాగు వైపు దృష్టి సారించారు. దీంతో అవసరానికి తగ్గట్లు విత్తనాలు అందుబాటులో లేక కొరత ఏర్పడింది.
పంటల వైవిధ్యీకరణ…
పంటల వైవిధ్యీకరణ అంటే ప్రస్తుతం సాగుచేస్తున్న పంటలతో పాటు అధిక పోషక విలువలు, అధిక దిగుబడి, నేలసారాన్ని పెంపొందించే మరిన్ని పంటలని చేర్చడం. పంట వైవిధ్యీకరణని అనుసరించడంతో పంటల సరళిలో ఉత్తమ మార్పులు రావడంతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా చేకూరుతుంది. పప్పు దినుసులు, నూనెగింజల అవసరానికి.. ఉత్పత్తికి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉం ది. అందువల్ల వివిధ రకాల పప్పు జాతి, నూనెగింజ పంటలను సాగుచేయాలి. మార్కెట్లో ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో దీర్ఘకాలిక దృష్టితో వనరులను సక్రమంగా వినయోగించడంలో భాగం గా వరికి బదులుగా ఇతర పంటలను సాగుచేయాలి.
గ్రామాల వారీగా అవగాహన సదస్సులు…
బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో యాసంగిలో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయదు. రైతులు ఎవరైనా వరి వేస్తే అందుకు వారే బాధ్యులు. దీంతో ప్రతి రైతు ఇతర పంటల సాగుపై దృష్టిసారించాలని ప్రతిరోజు గ్రామాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఒక ఏఈవో ఒక గ్రామానికి వెళ్లి అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తారు. అవసరమైతే అదే గ్రామంలో నాలుగు సమావేశాలైనా నిర్వహిస్తారు. ప్రతిరోజు ఎన్ని గ్రామాల్లో ఎన్ని సమావేశాలు నిర్వహించారు. ఎంత మంది రైతులు హాజరయ్యారు. ఏ రోజుకు ఆ రోజు సాయంత్రం వరకు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
నువ్వులు
నువ్వుల సాగును రైతులు ఎక్కువగానే చేస్తుంటారు. యాసంగిలో మంచి దిగుబడి వస్తుంది. ఈ పంట 3 నెలల్లో కోతకు వస్తుంది. నీరు నిలిచే ఆమ్ల, క్షారగుణాలు గల నేలలు ఈ పంటకు పనికి రావు. విత్తనం విత్తేముందు నేలను 2 నుంచి 4 సార్లు మెత్తగా దున్నాలి. అనంతరం విత్తనాన్ని విత్తాలి. ఒక ఎకరాకు రెండున్నర కిలోల నువ్వులు, మూడింతల ఇసుకను కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.
పెసర..
పెసర పంటను యాసంగిలో వేసుకోవచ్చు. అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సాగుకు ముందు నాగలితో ఒకసారి దున్ని విత్తనాన్ని విత్తాలి. ఈ పంట కాలం 70 రోజులు.
యాసంగి వరికి బదులు ఇతర పంటలు
మొక్కజొన్న..
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొక్కజొన్న పంటను ఎక్కువగా సాగుచేస్తారు. రెండో పంటగా యాసంగిలో సాగుచేసే ఈ పంట తో అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.ఈ పంటను ఆహా రంగా తీసుకోవడంతో పాటు దాణా రూపంలో పశువులకు మేతగా, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా వినియోగిస్తుం టారు. రేగడి, ఎర్రనేలలు, లోతైన మధ్య రకపు రేగడి నేలలు అనుకూలం. నీరు నిలువ ఉంచుకోగలిగే నేలలకు ఈ పంట ప్రత్యేకం. ప్రధానంగా గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను వాడాలి. తద్వారా విత్తనశుద్ధిని చేయాల్సిన అవసరం ఉండదు. విత్తనాలు వేసే ముందు భూమిని రెండు మూడు సార్లు కలియ దున్నాలి. వీలైనంతగా పశువుల ఎరువు, సేంద్రియ ఎరువులను వాడాలి.
ఎరువులు..
ప్రతి రైతు ఎరువులను తగినంత మోతాదులో వినియోగించాలి. పశువుల పేడ, సేంద్రియ ఎరువులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. ఒక ఎకరానికి నత్రజని 40 కిలోలు అవసరం ఉంటుంది. విత్తనం విత్తేటప్పుడు 1/4, విత్తిన నెల రోజులకు 1/2, 50-55 రోజులకు మిగిలిన 1/4 వంతును వేయాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను మూడుపంటల కొకసారి వేయాల్సి ఉంటుంది. ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాలి. ఎకరానికి 75 కిలోల యూరియా, 50 కిలోల డీఏపీ, 25 కిలోల పొటాష్ సమతుల్యంగా వినియోగించాలి. విత్తే సమయంలో భాస్వరం, పొటాష్, 1/3 వంతు యూరియా దుక్కిలో వేయాలి. జింక్‌ను ప్రతి ఎకరాకు 10 కిలోల చొప్పున వేయాల్సి ఉంటుంది.
మినుము
1) దిగుబడి ఎకరానికి : 5 క్వింటాళ్లు
3) సాగు ఖర్చు ఎకరానికి : రూ.16,500
4) నికర రాబడి ఎకరానికి : రూ.16,000
2) మార్కెట్ ధర క్వింటాల్ : రూ.6,500
మినుమును ఎక్కువగా సంగారెడ్డి జిల్లాలో పండిస్తారు. అన్నిరకాల భూముల్లో ఈ పంటను సాగు చేయొచ్చు. బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలం. ఈ పంటను డిసెంబర్ 20 వరకు విత్తుకోవచ్చు. వేసవి పంటగా ఫిబ్రవరి 1 నుంచి మార్చి15 వరకు వేసుకునే అవకాశం ఉంది. ఎకరాకు 6 నుంచి 8 కిలోల విత్తనాలు అవసరం పడతాయి.సాళ్ల పద్ధతిలో నాగలి లేదా గొర్రుతో విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్ కల్టివేటర్ లేదా సీడ్ డ్రిల్ కమ్ ఫర్టిలైజర్‌తో బోదె కాలువల విధానంలో కూడా విత్తనం వేసుకోవచ్చు.
అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం…
జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వరికి బదులు ఇతర పంటల సాగు ఎలా చేయాలో వివరంగా చెబుతున్నాం. ఆ దిశగా రైతులు కూడా పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రతి క్లస్టర్లో వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి యాసంగి సాగు గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వేరుశనగ సాగుచేస్తున్నారు. మరి కొంతమంది మొక్కజొన్న, స్వీట్ కార్న్, శనగ పంటలను వేశారు. జిల్లాలో 15 శాతం మేర యాసంగి సాగు జరిగింది. ప్రస్తుతం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.