ప్రకృతి ప్రసాదించిన ప్రతి పండూ రుచికరమైనదే. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే పండ్లను మన ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి. అయితే, ఏదో ఒక్క పండు మాత్రమే మనకు అనేకమైన ప్రయోజనాలు చేకూరుస్తుందా? అంటే అవుననే చెప్పాలి. అమెరికాలోని విలియం పాటర్సన్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో ఓ పండు అన్ని ఆరోగ్య ప్రయోజనాల్లో ముందువరుసలో నిలిచింది. పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా వివిధ రకాల పండ్ల పోషక విలువలు, క్యాలరీలను విశ్లేషించి ఈ అభిప్రాయానికి వచ్చారు.
ఈ అధ్యయనంలో విటమిన్లు, ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ లాంటి శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్లతో నిమ్మకాయలు మొదటి స్థానంలో నిలిచాయి. ఇతర ఏ పండుతో పోల్చి చూసినా నిమ్మ మనకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుందట! వంద క్యాలరీల మొత్తాన్ని తీసుకుంటే 41 ఆహార ఎంపికల్లో నిమ్మకాయ 100 శాతం వరకు పోషక అవసరాలను సంతృప్తి పరుస్తుందని అధ్యయనంలో తేలింది. నిండుగా పోషకాలు కలిగి ఉండే నిమ్మ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఐరన్ వంటబట్టేలా చేస్తుంది. అరుగుదలకు సహాయకారిగా ఉంటుంది.
మన రోజువారీ ఆహారాల్లో నిమ్మరసం తాగుతుండటం తరచుగా జరుగుతుండేదే. దీంతోపాటు సలాడ్లు, భోజనం, సూప్‌లలో కూడా నిమ్మరసం చిలకరించుకుంటే మంచిది. లెమన్ టీ, నిమ్మకాయ ముక్కలు, ఇతర పండ్ల ముక్కలను నీళ్లతో కలిపి చేసే ఇన్ఫ్యూషన్స్, లెమన్ ఐస్ క్యూబ్స్ కూడా మంచి ఆహార ఎంపికలే.
యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల గుండె సంబంధ వ్యాధులనూ నివారిస్తుంది. అంతేకాదు నిమ్మకే ప్రత్యేకమైన ఇంకో లక్షణం కూడా ఉంది. ఇది ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. కానీ, మన శరీరంలో క్షారతత్వానికి సంబంధించిన ఆల్కలైనైజింగ్ ప్రభావాన్ని చూపుతుంది. అలా శరీర పీహెచ్ స్థాయులను సమతూకంలో ఉంచుతుంది. అధ్యయనం ప్రకారం, నిమ్మకాయ మొత్తం శరీర జీవక్రియలను మెరుగుపరుస్తుంది. పేగుల ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది. నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తికి ఇదే కీలక పోషకం. పైగా నిమ్మలో ఉండే ఆమ్లం మన ఆరోగ్యానికి మిత్రుడిగా ఉంటుందే తప్ప శత్రువు కాదని పరిశోధకులు పేర్కొన్నారు. అలాగని ఎంత మంచిదైనా సరే పరగడుపునే నిమ్మరసం తాగకూడదు. ఇలా చేస్తే పండ్ల ఎనామెల్ దెబ్బతింటుంది. పొట్ట సున్నితంగా ఉండేవారికి అసౌకర్యాన్ని కలగజేస్తుంది.