అమరావతి : కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ( Job Calender ) అంటూ రెండేళ్లుగా ఊరించి ఉసూరుమనిపించిందని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లుందని, నిరుద్యోగ బిడ్డలను నమ్మించి నయవంచన చేసిందని ట్విటర్ ( Twitter ) వేదికలో విమర్శించారు.
జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు చేసింది పచ్చి మోసమని, ముష్టి 10 వేల పోస్టులకు షెడ్యూల్ ఇచ్చి, మాట నిలబెట్టుకున్నామని, జాబ్ ఫస్ట్ విధానమని గొప్పలు చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. విద్యాశాఖలో బోధన, బోధనేతర ఖాళీలు 30 వేల ఉద్యోగాలు, పోలీస్ శాఖ 19,999 ఉద్యోగాలు, ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులు, పంచాయతీ రాజ్ శాఖలో 26 వేల నియామకాల గురించి ప్రస్తావన లేదని విమర్శించారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో లెక్కకు తీసిన 27 వేల ఖాళీల భర్తీ లేనట్లేనా? రెవెన్యూలో 13 వేలు, వైద్యశాఖలో 26 వేలు, వ్యవసాయ శాఖలో 3 వేల ఖాళీలను వెంటనే నింపుతామని ఇచ్చిన హామీలు బూడిద పాలేనా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 153 విభాగాల పరిధిలో 1.80 లక్షలు ఖాళీలున్నాయని తెలిపారు.
నిరుద్యోగుల సంఖ్యలో దేశంలోనే రాష్ట్రం ప్రథమస్థానంలో ఉందని తెలిపారు. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలని, కోచింగ్ సెంటర్లలో లక్షలు పోసి, ఉన్న ఆస్తులు అమ్ముకుని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు న్యాయం జరగాలని ఆరోపించారు. అభ్యర్థుల వయోపరిమితి 42 నుంచి 46 ఏళ్లకు పెంచుతామని ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.