Petrol Price : ఇరాన్ వార్ ప్రభావం ఇప్పుడు మెల్లిగా ఇండియాలో పెట్రోల్, డీజిల్‌పై కూడా పడబోతుంది. ఇప్పటికే ఎల్పీజీ కొరత, ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై ఇప్పుడు పెట్రో భారం మొదలైంది. ప్రీమియం పెట్రోల్ (పవర్ పెట్రోల్) ధరల్ని పెంచుతూ హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్‌కు రూ.2 నుంచి రూ.2.35 వరకు ఈ పెంపు ఉండనుంది. శుక్రవారం నుంచే ఈ నిర్ణయం అమలులోకి రానుంది.
అయితే, ధరల పెంపునకు గల కారణాల్ని మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన ఎక్స్పీ95 రకం పెట్రోల్, అలాగే హిందుస్తాన్ పెట్రోలియం సంస్థకు చెందిన పవర్ పెట్రోల్ వంటి హై ఆక్టేన్ ఫ్యూయల్స్‌కు ఈ పెంపు వర్తిస్తుంది. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన నగరాల్లోనే ఈ ధరల పెంపు ఉండనుంది. ఈ పవర్ పెట్రోల్ సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే మరింత మెరుగ్గా పని చేస్తుంది. వాహనాలకు ఎక్స్ట్రా పవర్, పర్ఫామెన్స్ అందిస్తుంది. అయితే, ఈ తరహా పెట్రోల్ వాడే వాహనాలు చాలా తక్కువ. ఇక పవర్ పెట్రోల్ ధరలు పెరిగినప్పటికీ సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోవడం సామాన్యుడికి ఊరట కలిగించే అంశం. ఇటీవలి కాలంలో వీటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకపక్క అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, మన మార్కెట్లో చమురు ధరలు మాత్రం పెరగడం లేదు.
అయితే, పవర్ పెట్రోల్ ధర పెరగడానికి పశ్చిమాసియా ఉద్రిక్తతలే కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 110 డాలర్ల వరకు ఉంది. భారత కరెన్సీ విలువ తగ్గడం కూడా చమురు దిగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఇది భారంగా మారింది. ఈ నేపథ్యంలో అన్ని రకాల పెట్రోల్ ధరలు పెంచకుండా ప్రీమియం లేదా పవర్ పెట్రోల్ ధరల్ని మాత్రమే పెంచుతున్నాయి.