హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ( Budget ) మోసపూరితంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ (MLC Dasoju Sravan Kumar) ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని విమర్శించారు.
2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,29,720 కోట్ల రెవెన్యూ సంపాదిస్తామని గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించి కేవలం రూ.2,03,000 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని ఈ బడ్జెట్లో పేర్కొన్నారని తెలిపారు. కాగ్ ( CAG ) నివేదిక ప్రకారం జనవరి 2026 వరకు ప్రభుత్వం రెవెన్యూ ఆదాయం కేవలం రూ.1,38,371 కోట్లు మాత్రమే వచ్చిందని వెల్లడించిందని వివరించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.2,03,000 కోట్లు సాధించాలంటే, జనవరి 2026 నుండి ఇప్పటివరకు అంటే 50 రోజుల్లో రూ.65 వేల కోట్ల రెవెన్యూ రిసెప్ట్స్ వచ్చాయని మంత్రి ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదెలా సాధ్యమైందని దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. భట్టి విక్రమార్క వద్ద ఏదైనా అల్లావుద్దీన్ అద్భుత దీపమేదైనా ఉందా ? ఉంటే తమకు కూడా ఇవ్వాలని, పేద వర్గాలైన బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఆ డబ్బు పంచి పెడుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలపై సమాదానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.