స్పెషల్ టాస్క్బ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : కుటుంబాల్లో భూ తగాదాలు సహజం. అందునా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ భూములకు సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య పుట్టగొడుగుల్లా వివాదాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వివాదాలను పరిష్కరించేందుకు ‘ప్రైవేట్ దర్బార్’లు మొదలయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు భూ తగాదాల్లోకి ప్రవేశిస్తున్నారని, కుటుంబంలో ఒకరిని చేరదీసి మిగతావారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్ తదితర శాఖలను ప్రభావితం చేసి, నిబంధనలకు నిలువునా పాతర వేస్తున్నారు. వందల కోట్ల విలువైన భూములను అప్పనంగా సొంతం చేసుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
ఇటీవలే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనయుడు రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లి భూముల్లో తలదూర్చి నానా హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నానక్‌రాంగూడలోని 2.10 ఎకరాల భూమి వివాదంలో ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డితోపాటు సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి పేర్లు తెరమీదికి వచ్చాయి. వారు అధికారులను మేనేజ్ చేసి, తమకు అన్యాయం చేశారంటూ బాధిత వర్గం హైకోర్టును ఆశ్రయించింది. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ న్యాయస్థానం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిని బట్టే తెరవెనుక ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు రాష్ర్టాల్లో పేరొందిన ప్రముఖ నిర్మాణ సంస్థ జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రెండు రాష్ర్టాల్లోనూ భారీ ఎత్తున భూములు ఉన్నాయి. మాదల సుధాకర్, ఆయన తల్లి మాదల శకుంతల మొదటి నుంచీ డైరెక్టర్లుగా ఉన్నారు. సుధాకర్ సీఎండీగా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం నానక్‌రాంగూడ పరిధిలోని సర్వేనెంబరు 75లోని సంస్థకు చెందిన 2.10 ఎకరాల భూమిపై తాజాగా వివాదం తారస్థాయికి చేరింది. ఇందులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకి రావడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సంస్థ సీఎండీ మాదల సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. జన చైతన్య కంపెనీ 1999లో సర్వేనెంబరు 75లోని 2.10 ఎకరాలను కొనుగోలు చేసింది. కే చంద్రశేఖర్ అనే వ్యక్తి నుంచి సేల్ కమ్ జీపీఏ ద్వారా కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. 2006లో ఆ భూమి శకుంతల పేరిట సేల్‌డీడ్ జరిగింది. అనంతరం భూములపై ఎలాంటి వివాదాలు లేవు. 2024 మే 13న మాదల శకుంతల మరణించారు.
ఆ తర్వాత ఆమె మరో కుమారుడు మాదల రత్నగిరిబాబు, అతని కుమారుడు మాదల శ్రీరామ్ భాస్కర్ కలిసి కోడిసిల్ (వీలునామాకు జత చేసే అనుబంధ వీలునామా) సృష్టించారని, ముఖ్యమంత్రి మామ సూదిని పద్మారెడ్డి పేరిట సేల్‌డీడ్ చేశారని అఫిడవిట్లో మాదల సుధాకర్ పేర్కొన్నారు. సీఎం సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి అధికారులను మేనేజ్ చేశారని, దీంతో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా మూసాపేటలోని రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్-1 రిజిస్ట్రేషన్ చేశారని నివేదించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీనిపై రెండు రోజుల కిందట హైకోర్టులో వాదనలు జరిగాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ అధికారులు చర్యలు చేపట్టలేదని, పైగా నిషేధిత జాబితాలో ఉన్న భూమిని సేల్‌డీడ్ చేశారని ఉత్తర్వుల్లో న్యాయస్థానం పేర్కొన్నది. ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్-1 కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వీరితోపాటు ప్రతివాదులుగా ఉన్న ప్రైవేట్ వ్యక్తులు మాదల శ్రీరామ్ భాస్కర్, సూదిని పద్మారెడ్డి, అనుముల కొండల్‌రెడ్డిని కూడా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. జూన్ 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

సూదిని పద్మారెడ్డి (ముఖ్యమంత్రి రేవంత్ మామ) గత ఫిబ్రవరి 28న భూమిని కొనుగోలు చేసినట్టుగా చూపుతున్న సేల్‌డీడ్
వాస్తవానికి సర్వేనెంబరు 75లోని 2.10 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నది. భూ భారతి పోర్టల్‌లో పరిశీలించినప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లోని నిషేధిత జాబితాలో ఆ భూమి వివరాలు నమోదై ఉన్నాయి. ఇందుకు అధికారులు రెండు రకాల కారణాలను పేర్కొంటూ, సంబంధిత డాక్యుమెంట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. వాటి ప్రకారం.. గత ఏడాది జనవరిలో జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సువర్ణ లక్ష్మి (మాదల శకుంతల మరణించిన తర్వాత ఆ స్థానంలో సుధాకర్ భార్య లక్ష్మి డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు) రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రంగారెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఒక వినతిపత్రం సమర్పించారు. తమ కంపెనీకి చెందిన 2.10 ఎకరాలను సుధాకర్ సోదరుడి కుమారుడైన మాదల శ్రీరామ్ భాస్కర్ ఇతరులకు విక్రయించేందుకు సేల్‌డీడ్ కోసం ప్రయత్నిస్తున్నారని, నాలా అనుమతులు తీసుకోకుండా సేల్‌డీడ్ సాధ్యం కాదని అందులో పేర్కొన్నారు. ఈ భూమిపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని ఆమె కోరారు. దీంతోపాటు న్యాయవాది ద్వారా అధికారులకు నోటీసులు పంపి ఈ భూమిపై పలు కోర్టు వివాదాలు ఉన్నట్లు తెలిపారు. ఆ వివరాలను పొందుపరిచారు. మరోవైపు ఈ భూమిలో 1467 చదరపు గజాలను కొనుగోలు చేయాలనుకున్న మరో వినియోగదారుడు కూడా కూకట్పల్లి కోర్టు నుంచి ఇంజంక్షన్ ఉత్తర్వులు తెచ్చారు. వీటన్నింటి దృష్ట్యా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ భూమిని నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ మేరకు ఉత్తర్వులను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
సుధాకర్ కుటుంబంలో ఉన్న భూ వివాదాన్ని ఆసరాగా చేసుకొని సీఎం కుటుంబ సభ్యులు 2.10 ఎకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ విధానమే కీలక ఆధారంగా కనిపిస్తున్నది. సాధారణంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు ఏమాత్రం అంగీకరించరు. కానీ ఈ 2.10 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలిస్తే ఆద్యంతం పక్కా ప్రణాళికతో నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతుంది. మాదల శ్రీరామ్ భాస్కర్ నుంచి సూదిని పద్మారెడ్డికి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన సేల్‌డీడ్ జరిగింది. ఇందుకు 24వ తేదీన చలాన్ మొత్తాన్ని చెల్లించారు. చదరపు గజానికి రూ.26,700 చొప్పున 8,923 చదరపు గజాలకుగాను రూ.23.83 కోట్ల విలువైన భూమికి సుమారు రూ.1.81 కోట్లు చలాన్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు. అయితే వాస్తవంగా చలాన్ చెల్లించే సమయానికి సర్వేనెంబరు 75 లోని 2.10 ఎకరాల భూమి వ్యవసాయ భూమిగా ఉన్నది. అంటే.. శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సేల్‌డీడ్ జరగాలి. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో సేల్‌డీడ్ జరగాలంటే నాలా అనుమతి తీసుకొని, చదరపు గజాల్లో లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. అందుకే చలాన్ చెల్లించిన నాలుగు రోజులకు అంటే ఫిబ్రవరి 28వ తేదీన సర్వేనెంబరు 75/1లోని 2.10 ఎకరాలకు శ్రీరామ్ భాస్కర్ పేరుతో నాలా అనుమతి తీసుకున్నారు. అదేరోజు సాయంత్రం 4.16 గంటలకు ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలోని సూదిని పద్మారెడ్డి ఇంట్లో మూసాపేట జాయింట్ సబ్‌రిజిస్ట్రార్-1 సేల్‌డీడ్ (నెం.3489/26) పూర్తి చేశారు. విచిత్రమేమిటంటే సేల్‌డీడ్ జరిగిన సమయమే కాదు, ఈ క్షణానికి కూడా సదరు సర్వేనెంబరులోని 2.10 ఎకరాల భూమి నిషేధిత జాబితాలోనే ఉండటం గమనార్హం.
సర్వేనెంబరు 75లోని 2.10 ఎకరాలను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని గత ఏడాది శ్రీరాంభాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. తన నాయనమ్మ పేరిట ఉన్న భూమిని కోడిసిల్ ద్వారా తన పేరుమీదికి నమోదు చేయించుకొని, యాజమాన్య హక్కులు పొందినట్లు అందులో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేసింది. శ్రీరామ్ భాస్కర్ ఆ కంపెనీ బాధ్యులను విచారించాలని రిజిస్ట్రేషన్ శాఖను హైకోర్టు ఆదేశించింది. ఆ విచారణలో వారి వాదనలు విన్న తర్వాత నిబంధనల మేరకు ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను మూడు వారాల్లో పరిష్కరించాలని 2025 మార్చి 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయగా, తాజాగా నిషేధిత జాబితాలోని భూమిని సేల్‌డీడ్ చేశారు.

సాధారణ వ్యక్తి ఏదైనా పని కోసం వెళ్తే సవాలక్ష నిబంధనలు వల్లించే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పెద్దోళ్ల సేవలో నిబంధనల్ని బుల్డోజర్తో తొక్కించేందుకు ఎంత దూరమైనా వెళ్తున్నారని ఈ వ్యవహారంలో మరోసారి రుజువైంది.