హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి, అమ్మల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు అల్లం పద్మ (55) మంగళవారం మృతి చెందారు. కిడ్నీ సంబంధ సమస్యలతో కొద్దిరోజులుగా నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అల్లం పద్మ స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించారు.
ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ మెస్‌ను మూసివేసిన సందర్భంలో ఆమె అమ్మల సంఘం స్థాపించి, విద్యార్థి ఉద్యమకారులకు భోజనాలు పెట్టించి, అండగా నిలిచారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సనత్‌నగర్ జెక్ కాలనీలో రోడ్డు నంబర్ 1లోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ స్వగృహంలో భౌతికకాయాన్ని ఉంచి, మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అల్లం దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.
సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం
అల్లం పద్మ మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె సేవలను గుర్తు చేసుకొన్నారు. అల్లం నారాయణను సీఎం కేసీఆర్ ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అల్లం నారాయణ కుటుంబానికి అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని నగర మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వీ శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, సమాచార హక్కు కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి, సమాచారశాఖ కమిషనర్ అర్వింద్‌కుమార్, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిషాంక్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వ సీపీఆర్వో హజారే, ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, తెంజు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఇస్మాయిల్, రమణ, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యోగానంద్, నవీన్ తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి, నివాళి అర్పించారు.