మహబూబాబాద్ : వచ్చే నెల ఒకటి నుంచి మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా ఉన్న 1,207 పాఠశాలలన్ని ప్రారంభించాలని.. ప్రతి టీచర్ విధులకు హాజరుకావాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. పాఠశాలల పునః ప్రారంభంపై ఆమె కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1న పాఠశాలలు ప్రారంభంకాకుంటే.. విధులకు హాజరుకాని టీచర్లు ఉన్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బడుల పునః ప్రారంభానికి ఎక్కువ రోజులు లేనందున రెండు సెలవు దినాల్లో ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు విధుల్లో ఉండాలన్నారు.
విద్యాలయాల్లో గ్రౌండ్స్‌ను లెవలింగ్ చేయాలని సూచించారు. జిల్లాకు సంబంధించి పాఠశాలల పునః ప్రారంభానికి అధికారులందరికీ చెక్ లిస్ట్ ఇప్పటికే ఇచ్చామని, ఖచ్చితంగా అమలు జరుగాలన్నారు. సీజనల్ వ్యాధులు, కరోనా ఉన్నందున తల్లిదండ్రులు పిల్లల పట్ల ఆందోళన ఉందన్నారు. అదే సమయంలో గురుకులాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని కోరుతున్నారన్నారు. గురుకులాలు, విద్యాసంస్థల పట్ల తల్లిదండ్రులు నమ్మి పిల్లలను పంపుతున్నారని.. అందరం జాగ్రత్తగా ఉండాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ గురుకులాల్లో వైద్యులను పెట్టి, పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్నారు.
పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఒకటిన అంగన్వాడీ కేంద్రాలు సైతం ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లా అధికారులంతా తిరిగి ఏర్పాట్లు పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, దీనిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే పిల్లలు, తల్లిదండ్రులకు మేలు జరుగుతుందన్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే పిల్లలకు పాఠాల భయం లేకుండా ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన కలెక్టరేట్ కార్యాలయ పనులను మంత్రి సందర్శించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ సందర్శించారు.