Ramdev Baba : యోగాగురు (Yoga Guru) బాబా రాందేవ్ (Ramdev Baba) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ముస్లింలందరూ మతం మారినవారేనని.. శ్రీరాముడు, శ్రీకృష్ణులను తమ పూర్వీకులుగా గుర్తించాలని వ్యాఖ్యానించారు. బుధవారం మధుర (Madhura) లో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ (India) లో ఏ రాజకీయ పార్టీ కూడా ముస్లింలకు స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆశించడం లేదని, వారిని కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) వ్యాఖ్యలపై రాందేవ్ స్పందించారు.
మన ప్రాచీన రుషులు, శ్రీరామకృష్ణులు తమ పూర్వీకులేనని ముస్లిం సోదరులందరూ గుర్తించాలని రామ్‌దేవ్ బాబా అన్నారు. తమ మూలాలతో అనుసంధానమైతే వారు ఎన్నటికీ బలహీనంగా భావించరని రాందేవ్ పేర్కొన్నారు. హిందూ-ముస్లింలు ఐక్యంగా ఉంటేనే దేశం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే తరహా వ్యాఖ్యలను గతంలో బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ‘శివుడు పేదల దేవుడు, రాముడు ధనికుల దేవుడు’ అనే వ్యాఖ్యలపై కూడా రాందేవ్ స్పందించారు. సనాతన ధర్మంలో కులం, వర్గం పేరుతో కొందరు విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాముడు, కృష్ణుడు, శివుడు, హనుమంతుడు అందరూ ఒక్కటేనని, దేవుడి పేరుతో గందరగోళం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.