కోదాడ రూరల్, జూన్ 09 : ఈ నెల 21, 22 తేదీల్లో కోదాడ లాల్ బంగ్లాలో నిర్వహించే అఖిల భారత రైతు కూలీ సంఘం సూర్యాపేట జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోటు లక్ష్మయ్య, బొడ్డు శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక లాల్ బంగ్లాలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర అఖిల భారత రైతు కూలీ సంఘానికి ఉందన్నారు.
రైతాంగం పండించిన పంటకు సరైన మద్దతు ధర అందించాలని, దానికి చట్టబద్ధత కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దు కోసం జరిగిన పోరాటంలో, రైతాంగానికి ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని, రైతు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, ధాన్యం కాంటాల్లో జరిగే మోసాలపై, గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేసి, రోజు కూలి రేటు పెంచాలని, సాగునీటి కోసం, రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై ఉద్యమిస్తుందని తెలిపారు.
బూర్జువా పాలకవర్గ ప్రభుత్వాలు అవలంబించే ద్వంద నీతిని ఖండిస్తూ కర్షకుల పక్షాన కలిసి కొట్లాడుతుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే గత మహాసభ నుండి నేటి వరకు జరిగిన ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకొనుటకు ఈ మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ప్రజాసామికవాదులు తోడ్పాటున అందించి మహాసభలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు అలుగుబెల్లి వెంకన్న, పారెల్లి నాగయ్య, మేకల కనకారావు, దశరథ, దూద్య, వి.నరసింహారావు, గండు నాగేష్, లక్ష్మయ్య, మద్దలవెంకన్న, వీరబాబు, విజయ్ పాల్గొన్నారు.