హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): భూముల రెగ్యులరైజ్‌కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన అన్ని డాక్యుమెంట్లను ఈనెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో 22ఏ అంశంపై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మలాజ్‌గిరి, సంగారెడ్డి కలెక్టర్లు, జిల్లా సబ్ రిజిస్ట్రార్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిషేధిత ఆస్తుల(22ఏ) జాబితాకు సంబంధించి అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ల అనుమతులు తదితర వివరాలతో కూడిన అన్ని డాక్యుమెంట్లను ఇందులో పొందుపరచాలని ఆదేశించారు.