హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ) : మామూలు తాగుడు కాదు. కేవలం ఒకేఒక్క రాత్రి ఖర్చు లెక్కలు తీస్తే మత్తు దిగిపోయేంతటి తాగుడు. ఇప్పటికే మద్యంపై ఖర్చు చేయటంలో దక్షిణాది రాష్ర్టాల్లో తెలంగాణే టాప్ అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ తేల్చిన విషయం తెలిసిందే. దాన్ని తలదన్నే రికార్డు 2025 డిసెంబర్ 31న నమోదైంది. ఆ ఒక్క నెలలోనే అత్యధికంగా రూ.5,102 కోట్ల మద్యం విక్రయించిన ఎక్సైజ్ శాఖ, 2024 డిసెంబర్‌తో పోలిస్తే రూ.1,244 కోట్లు అదనంగా సమకూర్చుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఇక న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న ఏకంగా రూ.400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారిక లెక్కలు మరో సరికొత్త రికార్డే. డిసెంబర్ చివరి నాలుగు రోజుల మద్యం అమ్మకాలు 28న రూ.182 కోట్లు, 29న రూ.282 కోట్లు, 30న రూ.375 కోట్లతో మొత్తంగా రూ.1,239 కోట్ల ఆదాయంతో ఎక్సైజ్ శాఖ కనీవినీ ఎరుగని స్థాయిలో రికార్డు అమ్మకాలు జరిపింది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నిరుడు జూన్, జూలై నెలల్లో మద్యవిక్రయాలు, వినియోగంపై దేశవ్యాప్తంగా సర్వే చేసి సెప్టెంబర్‌లో ఫలితాలు వెల్లడించింది. దాని లెక్కల ప్రకారం తెలంగాణలో ఒకొకరు ఏడాదికి సగటున రూ.11,351 విలువైన మద్యం తాగుతున్నారని తేల్చింది. ఎక్సైజ్ రికార్డుల ఆధారంగా లెక్కలు కట్టే సదరు సంస్థ 2024లో రూ.36వేల కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగినట్టూ ప్రకటించింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.36 వేల కోట్ల మార్కు దాటిన అమ్మకాలు, మిగతా గ్యాపులో మరో రూ.18 వేల కోట్లకు చేరే అవకాశాలున్నాయని ఆ మేరకు నిల్వలు సిద్ధం చేసుకుంటున్నది. ఈ లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణలో ఒక్కో వ్యక్తి సగటు మద్యం ఖర్చు రూ.2,000 మార్క్‌ను దాటుతుందనే అంచనాలుండగా, అది దేశంలోనే నంబర్ వన్ అని సంబంధిత శాఖ చెప్పడం గమనార్హం.