లక్నో, డిసెంబర్ 20: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్లో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. మొదట్లో అధికార బీజేపీనే ముందంజలో ఉన్నట్టు కనిపించినా.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్వాదీ పార్టీ వేగంగా బలం పుంజుకుంటున్నది. కాషాయ పార్టీ ఆధిక్యాన్ని సవాల్ చేసే స్థాయికి ఆ పార్టీ చేరింది. ఎస్పీ దూకుడును పరిశీలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైనా జరుగొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఏబీపీ-సీఓటర్ తాజాగా నిర్వహించిన సర్వేలో ఇదే విషయం స్పష్టమవుతున్నది.
తగ్గుతున్న అంతరం..
2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి 21% ఓట్లు వచ్చాయి. గత నెల 27న నిర్వహించిన సర్వేలో ఎస్పీ ఓటింగ్ షేర్ 32 శాతానికి పెరుగగా, 4న నిర్వహించిన సర్వేలో అది 33 శాతానికి పెరిగింది. తాజా సర్వేలో ఈ ఓటింగ్ షేర్ 34కు చేరింది. అంటే సమాజ్వాదీ పార్టీ రోజురోజుకూ బలం పుంజుకుంటున్నట్టు అర్థమవుతున్నది. ప్రస్తుతం బీజేపీకి, ఎస్పీకి మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం 7 శాతమే. ఎన్నికల సమయానికి ఇది మరింత తగ్గవచ్చని సర్వేలో తేలింది.
బీజేపీకి నిషాద్ వర్గం ఝలక్!
కాషాయ పార్టీకి నిషాద్ వర్గం ఝలక్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్ అంశంపై బీజేపీ నుంచి స్పష్టత రాకపోవడంతో నిషాద్ కమ్యూనిటీ ఆగ్రహంగా ఉన్నది. కోటా అంశాన్ని తేల్చకపోతే బీజేపీకి ఓటు వేయబోమని వారు తేల్చిచెబుతున్నారు. మరోవైపు, ఇతర పార్టీల నుంచి ఎస్పీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఎస్పీ, బీఎస్పీ నుంచే కాకుండా అధికార బీజేపీ నుంచి కూడా పలువురు నేతలు ఎస్పీ గూటికి చేరుతున్నారు. తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే రామ్ ఇక్బాల్ సింగ్ సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీ కూడా వ్యూహాలకు పదునుపెట్టింది. బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న బ్రాహ్మణులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఈసారి బ్రాహ్మణులకు గరిష్ఠంగా సీట్లు కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ తాయిలాలు
అఖిలేశ్యాదవ్కు ప్రజాదరణ పెరుగుతుండటంలో బీజేపీ తత్తరపాటుకు గురవుతున్నది. ప్రజలను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నది. కోటి మంది డిగ్రీ, పీజీ ఫైనలియర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబెట్లు అందిస్తామని యోగి సర్కారు తాజాగా ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.