‘నా తొలి సినిమా ‘సర్కారు నౌకరి’ పీరియడ్ డ్రామా అయితే.. ఈ రెండో సినిమా ‘కొత్త మలుపు’ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో ఎమోషన్స్‌తో పాటు కథను ముందుకు నడిపించే ఆసక్తికరమైన సస్పెన్స్ కూడా ఉంటుంది’ అంటున్నారు గాయని సునీత తనయుడు, యువ నటుడు ఆకాష్ గోపరాజు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్త మలుపు’. భైరవి అర్థ్యా కథానాయిక. శివవరప్రసాద్ కేశనకుర్తి దర్శకుడు. తథాస్తు క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నది. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో హీరో ఆకాష్ గోపరాజు మాట్లాడారు. ‘కోనసీమ నేపథ్యంలో సాగే రోమ్కామ్ లవ్‌స్టోరీ ఇది.
ఇందులో నాది నేటి యువత ఆలోచనలు, వారి భావోద్వేగాలకు దగ్గరగా ఉండే పాత్ర. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటంది. తొలి సినిమా కంటే మెరుగ్గా కనిపించేందుకు, నటించేందుకు ప్రయత్నించాను. ఈ కథలో ఊహించని మలుపులు నన్ను ఆకట్టుకున్నాయి. నేను ఎలాంటి పాత్రనైతే కోరుకున్నానో, సరిగ్గా అలాంటి పాత్రే ఈ సినిమా ద్వారా నాకు దొరికింది. మైత్రీ వారు విడుదల చేయడం వల్ల సినిమాపై జనాల్లో కూడా ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకుంటాయి. పల్లెటూరి అందాలు, ప్రేమ, నవ్వులు, భావోద్వేగాలు, సస్పెన్స్.. అన్నీ కలగలిసిన కంప్లీట్ మూవీ ఇది’ అని తెలిపారు ఆకాష్ గోపరాజు.