Air Passengers | న్యూఢిల్లీ, జనవరి 22: గత ఏడాది దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ 6.12 శాతం పెరిగింది. 2023లో 15.20 కోట్లుగా ప్రయాణికులుంటే.. 2024లో 16.13 కోట్లుగా ఉన్నారు. ఈ మేరకు బుధవారం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. గత నెల డిసెంబర్లో 1.49 కోట్లకుపైగా ప్రయాణికులు నమోదైనట్టు స్పష్టం చేసింది. 2023 డిసెంబర్లో దాదాపు 1.38 కోట్లేనని వివరించింది. దీంతో 8.19 శాతం వృద్ధి కనిపించింది. కాగా, దేశంలో పెరుగుతున్న ప్రయాణికులకు తగ్గట్టుగా విమానయాన సంస్థలు సైతం తమ విమాన సర్వీసుల సంఖ్యను పెంచేస్తున్నాయి.
ఇప్పటికే భారత్.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్లో ఇండిగో మార్కెట్ వాటా 64.4 శాతంగా ఉంటే, ఎయిర్ ఇండియా వాటా 26.4 శాతంగా ఉన్నది. ఇక ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్ వాటాలు 4.6 శాతం, 3.3 శాతంగా ఉన్నాయి. అలాగే ఇండిగో వన్-టైమ్ పర్ఫార్మెన్స్ (ఓటీపీ) అత్యధికంగా 73.4 శాతంగా ఉన్నది. తర్వాతి స్థానాల్లో ఎయిర్ ఇండియా (67.6 శాతం), ఆకాశ ఎయిర్ (62.7 శాతం), స్పైస్‌జెట్ (61.5 శాతం), అలయెన్స్ ఎయిర్ (55.6 శాతం) ఉన్నాయి.