న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఎయిర్ ఇండియా మళ్లీ టాటాల చేతికే వచ్చింది. దాదాపు 70 ఏండ్ల తర్వాత సొంతింటికే ‘మహారాజా’ చేరుకున్నారు. అయితే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, ప్రభుత్వం వదిలించుకున్న ఈ సంస్థ.. టాటాలతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందా? అన్నదే ఇప్పుడు అందర్నీ తొలుస్తున్న ప్రశ్న. భారీ పెట్టుబడులు కావాల్సిందే రూ.18,000 కోట్లతో ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్.. భవిష్యత్తులో భారీ ఎత్తున దీనిపై పెట్టుబడులు పెట్టాల్సిందేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రంగాల్లో విమానయాన రంగం ముందు వరుసలో ఉన్నది. ఇలాంటి తరుణంలో ఎయిర్ ఇండియాను గాడిలో పెట్టడానికి టాటాలు మరో రూ.20వేల కోట్లనైనా వెచ్చించక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతచేసినా మార్కెట్లో మునుపటి పరిస్థితులు నెలకొనకపోతే అంతా వృథానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా కారణంగా విమానయాన రంగంలో పడిపోయిన ప్రయాణీకుల రద్దీ తిరిగి కోలుకోవాలంటే కనీసం నాలుగేైండ్లెనా పడుతుందని పరిశ్రమ అంచనా. ఈ క్రమంలో 2025 వరకు ఎయిర్ ఇండియాలో టాటాల పెట్టుబడులపై లాభాలను ఆశించడం అత్యాశేనని ఇండస్ట్రీ సర్వేలూ చెప్తున్నాయి.
టాటా గ్రూప్‌పై అదనపు భారం?
ఎయిర్ఏషియా, విస్తారాల్లో టాటాలకు ఇప్పటికే వాటాలున్నాయి. ఈ రెండు సంస్థల్లో రూ.6,000 కోట్లకుపైగా పెట్టుబడులను టాటా సన్స్ పెట్టింది. కానీ ఇప్పటిదాకా రూ.9,000 కోట్లకుపైగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో గత 14 ఏండ్లుగా నష్టాల్లోనే ఈదుతున్న ఎయిర్ ఇండియా కూడా ఇప్పుడు టాటాల గూటికే చేరింది. దీంతో గ్రూప్‌పై అదనపు భారమేనన్న వాదన వినిపిస్తున్నది. ఈ ఏడాది మార్చి నాటికి ఎయిర్ ఇండియా నష్టాలు రూ.83,916 కోట్లుగా ఉన్నాయి. రుణ భారం రూ. 61,562 కోట్లుగా ఉన్నది. తాజా డీల్‌తో రూ.15,300 కోట్ల అప్పులు టాటా సన్స్ తీర్చాల్సి ఉన్నది.