Air India : లండన్ నుంచి బెంగళూరు రావాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా బయల్దేరడానికి కొద్ది గంటల ముందే ఆగిపోయింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 విమానం సోమవారం లండన్ నుంచి బెంగళూరు బయల్దేరాల్సి ఉంది. అయితే, బయల్దేరడానికి ముందు సాధారణ తనిఖీలు నిర్వహిస్తారు. కీలక అంశాల్ని ముందుగా పైలట్లు తనిఖీ చేస్తారు.
ఇలా తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్‌లో లోపం ఉండటాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ అంశంపై ఓఈఎం (విమానం, విడిభాగాల తయారీ సంస్థ)కు తెలిపినట్లు అధికారులు తెలిపారు. అలాగే డీజీసీఏకు కూడా సమాచారమిచ్చినట్లు చెప్పారు. సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో విమానాన్ని పూర్తిగా నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. ఫ్యుయల్ స్విచ్‌లో లోపం గురించి పైలట్ సమాచారం అందించడంతో చర్యలు తీసుకున్నామని, బోయింగ్ సంస్థకు చెప్పామని ఎయిర్ ఇండియా ప్రతినిధులు అన్నారు.
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిచ్చి, ఆ విమాన సేవల్ని నిలిపివేశామని తెలిపారు. అంతకుముందు జరిపిన తనిఖీల్లో ఈ విషయం బయటపడలేదని అధికారులన్నారు. డీజీసీఏ సూచనల మేరకు అన్ని బోయింగ్ విమానాల్లో ఈ తరహా తనిఖీలు చేశామన్నారు. గత ఏడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 260 మంది మరణించిన సంగతి తెలిసిందే.