న్యూఢిల్లీ, జూన్ 20: అహ్మదాబాద్‌లో డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా బుకింగ్స్ సగటున 20 శాతం, టికెట్ ధరలు 15 శాతం తగ్గాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(ఐఏటీవో) వెల్లడించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలు రెండింట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని తెలిపింది. ఒక్కో ఎయిర్‌లైన్స్, ఒక్కో రూట్లో ఈ తగ్గుదలలో మార్పులు ఉన్నాయని పేర్కొంది. ఎయిరిండియా విమానాల్లో భద్రతపరంగా వ్యవస్థాగత లోపాలు లేవని, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది. ఈ ప్రతికూల పరిస్థితి తాత్కాలికమని, ప్రయాణికుల్లో తిరిగి విశ్వాసం నెలకొంటుందని ఐఏటీవో అధ్యక్షుడు రవి గోసైన్ చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం, హాస్పిటాలిటీ(ఎఫ్ఏఐటీహెచ్) జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. కానీ టికెట్ బుకింగ్స్, ధరల తగ్గుదలపై ఎయిరిండియా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
8 ఎయిరిండియా విమానాలు రద్దు!
నిర్వహణ కారణాల వల్ల శుక్రవారం 8 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిరిండియా తెలిపింది. ఇందులో 4 అంతర్జాతీయ, 4 దేశీయ సర్వీసులు ఉన్నాయని వెల్లడించింది. అంతర్జాతీయ సర్వీసులలో దుబాయ్-చెన్నై, ఢిల్లీ-మెల్బోర్న్, మెల్బోర్న్-ఢిల్లీ, దుబాయ్-హైదరాబాద్ విమానాలు, దేశీయ సర్వీసులలో పుణె-ఢిల్లీ, అహ్మదాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-ముంబై, చెన్నై-ముంబై విమానాలు ఉన్నాయి.
ఎయిరిండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి ; పుణె నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రద్దు
న్యూఢిల్లీ: ఢిల్లీ-పుణె ఎయిరిండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. విమానం ఢిల్లీ నుంచి పుణెకు సురక్షితంగా చేరుకున్న తర్వాత పక్షి ఢీకొట్టిన విషయం గుర్తించినట్టు ఎయిరిండియా ఓ ప్రకటనలో పేర్కొంది. పుణె నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన రిటర్న్ జర్నీని రద్దు చేసినట్టు తెలిపింది. ‘ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. టికెట్ల క్యాన్సిల్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చాం’ అని తెలిపింది.
ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
చెన్నై నుంచి మదురైకి 68 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఇండిగో విమానం అరగంట ప్రయాణం చేసిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి చెన్నైకి వచ్చి ల్యాండ్ అయింది. మార్గమధ్యలో సమస్యను గుర్తించిన పైలట్ వెనక్కి వచ్చేందుకు అనుమతి కోరగా అధికారులు అనుమతించారని ఇండిగో అధికారులు తెలిపారు.