టెక్ వరల్డ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ, మెటా (ఫేస్బుక్ మాతృ సంస్థ) స్పోర్ట్స్ రంగంలోకి దూకింది! దిగ్గజ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ ఓక్లీతో జతకట్టి, అథ్లెట్లు, ఫిట్నెస్ ప్రియుల కోసం ప్రత్యేకంగా ఏఐ పవర్డ్ స్మార్ట్ గ్లాసెస్ తీసుకొచ్చింది. వీటి పేరు ‘ఓక్లీ మెటా హెచ్ఎస్టీఎన్’. వీటిని ఏఐ గ్లాసెస్ తర్వాతి తరమని మేకర్స్ పిలుస్తున్నారు. మెటా అత్యాధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఓక్లీ స్టయిలిష్ స్పోర్ట్స్‌వేర్ డిజైన్.. దీని ప్రత్యేకతలు అని చెప్పొచ్చు. దీంట్లో 3కే అల్ట్రా-హెచ్డీ కెమెరా ఉంది. దీంతో మీ ఆటలోని ప్రతి క్షణాన్ని హై క్వాలిటీలో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే, ఓపెన్-ఎయిర్ స్పీకర్లతో ఇయర్‌ఫోన్స్ అవసరం ఉండదు. మరైతే.. బయటి శబ్దాల మాటేంటి అంటారా? అవి కూడా వినిపిస్తాయి. ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ రక్షణ ఉంది. దీంతో వర్షంలో, చెమటలో తడిచినా డోంట్ వర్రీ! వర్కౌట్లకు, ఔట్‌డోర్ ట్రైనింగ్‌కు పర్ఫెక్ట్! దీంట్లోని మరో ప్రత్యేకత ఏంటంటే..
ఆన్-డివైస్ మెటా ఏఐ. ఇది పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. ఆటలో రియల్ టైమ్ కోచింగ్ కావాలన్నా, చేతులు ఖాళీగా లేనప్పుడు ఏదైనా సమాచారం కావాలన్నా.. అడిగితే చెప్పేస్తుంది! ‘హేయ్ మెటా! ఈరోజు గాలి ఎంత వేగంగా వీస్తోంది?’ అని గోల్ఫ్ ఆడుతూ అడిగితే వెంటనే చెప్పేస్తుంది! బ్యాటరీ బ్యాక్అప్ కూడా బాగుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 8 గంటలపాటు యాక్టివ్‌గా వాడుకోవచ్చు. స్టాండ్బైలో 19 గంటల వరకు ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం 20 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. కేస్‌తో అదనంగా 48 గంటల బ్యాటరీ లైఫ్ పొందవచ్చు. స్టయిల్‌కు స్టయిల్! పర్ఫార్మెన్స్కు పర్ఫార్మెన్స్! గ్లోబల్ స్పోర్ట్స్ ఐకాన్స్ కెలియన్ ఎంబాపే, ఎన్ఎఫ్ఎల్ సూపర్ స్టార్ పాట్రిక్ మహోమ్స్ ఈ గ్లాసెస్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండటం విశేషం. లిమిటెడ్ ఎడిషన్ గోల్డ్యాక్సెంట్ వెర్షన్ ధర సుమారు రూ.41,000.