ప్రపంచవ్యాప్తంగా మహిళా ఐటీ ఉద్యోగులపై ఏఐ పంజా విసురుతున్నది. కృత్రిమ మేధ ప్రభావంతో.. 28శాతం మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది. అదే పురుషుల్లో ఈ సంఖ్య.. 21శాతంగా ఉన్నది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక.. ‘జెండర్ స్నాప్‌షాట్-2025’ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలో ఐటీ రంగంలో జెండర్ డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సదరు నివేదిక పిలుపునిచ్చింది. అంతేకాకుండా.. డిజిటల్ రంగంలో లింగ అసమానతలను కూడా ఈ నివేదిక హైలైట్ చేస్తున్నది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. ప్రపంచ టెక్ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు కేవలం 29శాతం మంది మాత్రమే ఉన్నారు.
అదే నాయకత్వం స్థానాల్లో మహిళల వాటా 14శాతం మాత్రమే! ఈ క్రమంలో ఐటీ రంగంలో పురుషాధిక్యమే రాజ్యమేలుతున్నదనీ, ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ రంగంలో లింగ సమానత్వాన్ని సాధించడం ద్వారా.. 34.5 కోట్ల మంది మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. 3 కోట్ల మందిని తీవ్రమైన పేదరికం నుంచి బయటపడేసే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు. మరో 4.2 కోట్ల మందికి ఆహార భద్రత దక్కుతుందని వెల్లడిస్తున్నారు. ఇందుకోసం మహిళలకు ఏఐపై శిక్షణ ఇప్పించడం, డిజిటల్ సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు మహిళలకు కార్మిక-సామాజిక రక్షణ విధానాలను అమలు చేయడం ముఖ్యమని చెబుతున్నారు.