Local Body Election | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 26 లేదా 27న జారీ అవుతుందా? దస రా తర్వాత ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల అవుతుందా? అంటే రాష్ట్రంలో అధికార యంత్రాంగం వడివడిగా చేపట్టిన ఎన్నికల ముందస్తు కసరత్తు దానికి సంకేతంగా కనిపిస్తున్నది. దసరా తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని సమాచారం. చట్టబద్ధంగా నిలుస్తుందా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏర్పాట్లకే సిద్ధమవుతున్నది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తన సంసిద్ధతను తెలుపుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నేడో, రేపో లేఖ రాసే అవకాశం ఉన్నది. రిజర్వేషన్ల వివరాలను అందించనున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం జీవో జారీ చేస్తారని, ఆ జీవోతోపాటు షెడ్యూల్ ఒకే సమయంలో వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
సీఎంవోలో రిజర్వేషన్ల జీవో!
ఎన్నికల ప్రక్రియను ఒకసారి మొదలుపెట్టిన తర్వాత కోర్టులు పెద్దగా జోక్యం చేసుకోకపోవచ్చన్న భావనతో అధికారులు ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపిన బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నది. ఈ నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల కోసం జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండగా, డ్రాఫ్ట్ జీవోను ఇప్పటికే సిద్ధంచేశారు. న్యాయ, సంక్షేమ శాఖ ల కార్యదర్శుల పరిశీలన కూడా పూర్తయి సీఎంవోలో ఉన్నది. 26న స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చి దసరా తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెల్సింది. హైకోర్టు ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని ప్రభుత్వం కోర్టుకు చెప్పుకునేందుకు 26న షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు.
రేపు, ఎల్లుండి పోలింగ్ అధికారులకు శిక్షణ
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ అధికారుల(పీవో)ను నియమించాలని అన్ని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లేఖలు రాశారు. నియమించిన పీవోలకు రెండు రోజులపాటు జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 26, 27న డివిజన్ల వారీగా శిక్షణ ఏర్పాట్లు చేశారు.