Bathukamma | తొమ్మిది రోజులు బతుకమ్మకు పెట్టే ప్రసాదాల్లో నవధాన్యాలు వచ్చేట్టుగా చూడాలంటారు. అటుకుల రూపంలో బియ్యం, ముద్దపప్పులో కందులు, పెసరపప్పు నివేదిస్తారు. ఇలా సమర్పించే నైవేద్యాలు ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తాయి. అట్ల బతుకమ్మ సందర్భంగా పెసర్లు, బియ్యంతో చేసిన అట్లు నివేదిస్తారు. సాధారణంగా అట్లు ఎక్కువగా మినుములతో చేసుకుంటారు.
మినుముల్లో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి. బలవర్ధకమైన ఆహారమే అయినా ఎక్కువగా వాడితే బుద్ధిమాంధ్యం ఏర్పడుతుంది. వాల్మీకి రామాయణంలోనూ దీని ప్రస్తావన ఉన్నది. పెసర్లు జీర్ణశక్తిని పెంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. అందుకే తెలంగాణలో అట్ల బతుకమ్మ సందర్భంగా పెసరపప్పుతో చేసిన అట్లను నైవేద్యంగా పెడుతారు.
– డా॥ ఆర్.కమల
ఈసారి నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని. చతుర్భుజాలతో, వరద, అభయ హస్తాలతో, ఖడ్గం, పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది అమ్మవారు. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్యతేజస్సుతో అలరారుతుంటుంది. కతు మహర్షి తపస్సంపన్నుడు. అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తాడు. ఆమె కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. కతుని దీక్షకు మెచ్చి దర్శనమిస్తుంది పరాశక్తి. ‘ఏం వరం కావాలి?’ అని అడుగుతుంది. అమ్మవారి అనుగ్రహం తప్ప మరే కోరికా లేని కతుడు… ‘నీవు నా ఇంట జన్మించి.. మా వంశాన్ని పునీతం చేయమ’ని కోరుకుంటాడు. కొన్నాళ్లకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దివ్య తేజస్సుతో కతుని ఇంట ఆవిర్భవించింది అమ్మవారు. కాత్యాయనిగా లోకప్రసిద్ధి పొందింది. కాత్యాయని అంటే తేజ స్వరూపిణి, మహాతేజో పుంజం అని అర్థాలు. తేజస్సు అంటే జ్ఞానం. అమ్మవారు జ్ఞానదాయిని. కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలధి, చింతా జలధి, సంసార జలధి అనే భవసాగరాల నుంచి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థకామమోక్షాలకు అధికారిణి ఈమె.
‘పార్వతీదేవే కాత్యాయని’ అని అమరకోశం చెబుతున్నది. పతంజలి మహర్షి ‘దుర్గాదేవే.. కాత్యాయని’ అని అభివర్ణించాడు. శాక్తేయంలో కాత్యాయనీ దేవిని దుర్గ, భద్రకాళి, చండికల అపర అవతారంగా పరిగణిస్తారు. మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి కాత్యాయని సింహ వాహనం అధిష్ఠించి సాయం చేసిందని స్కాంద పురాణం చెబుతున్నది. మార్కండేయ పురాణం, దేవీ భాగవతం కాత్యాయని ప్రాశస్త్యం గురించి ప్రస్తావించాయి. బౌద్ధ, జైన వాఙ్మయంలోనూ అమ్మవారి విశేషాలు కనిపిస్తాయి. యోగశాస్త్రం ప్రకారం కాత్యాయని ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవతగా చెబుతారు. ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మవారు. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నంద గోప సుతం దేవిం పతియే కురుతే నమః॥ అని ధ్యానిస్తూ కాత్యాయనీ దేవిని ఉపాసిస్తారు. ఆ తల్లి అనుగ్రహంతోనే గోపికలంతా శ్రీకృష్ణుడి అనురాగం పొందారని భాగవతం పేర్కొన్నది. కాత్యాయని ఆరాధన వల్ల ఉత్తమ సంతానం, కుటుంబవృద్ధి, సౌభాగ్యం, సంపదలు కలుగుతాయి.