ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా భాగం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా, దవాఖానల్లో ఎక్కువసేపు వేచి ఉండటం, పరిపాలనా వ్యవస్థలో లోపాలను సవరించడానికి ‘ఏఐ’ అవసరం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు.
అమెరికాకు చెందిన ‘రివ్స్ప్రింగ్’ అనే సంస్థ.. ‘క్లినికల్ హెల్త్‌కేర్ కమ్యూనికేషన్లలో ఏఐ అవసరం’ గురించి ఓ సర్వే చేపట్టింది. 1,113 మంది రోగులు, వారి సన్నిహితులతో ఆన్లైన్ ద్వారా అభిప్రాయాలు సేకరించింది. ఈ సందర్భంగా పలువురు.. ‘హెల్త్‌కేర్’ సేవల్లో ఆధునిక సాంకేతికత పెరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. దవాఖానల్లో సిబ్బంది కొరతను అధిగమించడంతోపాటు ఉన్నవారిపైనా పనిభారాన్ని తగ్గించే సామర్థ్యం ‘ఏఐ టెక్నాలజీ’కి ఉంటుందని పేర్కొన్నారు. దాంతో రోగికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చని వెల్లడించారు.
ప్రతి ఐదుగురిలో ఒకరు.. హాస్పిటల్ ప్రతినిధితో ఫోన్ ద్వారా మాట్లాడటం కన్నా.. ఏఐని ఉపయోగించడానికే ఇష్టపడుతున్నారు. ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు ఫోన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తున్నదనీ, దానికన్నా ఏఐ ద్వారా వేగవంతమైన సేవలను పొందవచ్చని వారు విశ్వసిస్తున్నారు. సాధారణ పనుల కోసం చాట్‌బాట్, ఆటోమేటెడ్ ఫోన్ సిస్టం వంటి సాధనాలను వాడుకోవాలని కోరుతున్నారు.
ఇక ప్రతిముగ్గురిలో ఒకరు (32 శాతం) ఆధునిక సాంకేతికతపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఏఐని ఎక్కువగా ఇష్టపడే రోగులలో 35-54 సంవత్సరాల వయసు గలవారు 25 శాతం ఉండగా.. ఉన్నత విద్యావంతులు 30 శాతం, ఏడాదికి 70 లక్షలు, అంతకన్నా ఎక్కువ సంపాదించేవారు 27 శాతం మంది ఉన్నారు.
సర్వేలో పాల్గొన్నవారిలో మూడింట ఒక వంతుమంది సందేహాల నివృత్తికి ఏఐ మంచి ఆప్షన్ అని చెప్పారు. హాస్పిటల్ బిల్లులు, చెల్లింపులు.. ఇలాంటివి మనుషులకన్నా ఏఐతోనే సులువుగా మాట్లాడొచ్చని అంటున్నారు. ఇక అపాయింట్మెంట్కు సంబంధించిన షెడ్యూలింగ్, ప్రిపరేషన్లాంటివి ఏఐ పక్కాగా నిర్వహిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణలో ఏఐని అమలు చేయాలనీ, అధునాతన సాధనాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు.