40 ఏళ్ల తర్వాత చాలామందిలో డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి రుగ్మతలు కనిపిస్తున్నాయి. అయితే, ఇవి కేవలం వారిలో మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. చాలామందిలో వివిధరకాల న్యూరోడీజెనరేటివ్ వ్యాధులకూ కారణం అవుతున్నాయి. ఈ విషయాన్ని జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు వెల్లడించారు. తాజాగా, వారు నిర్వహించిన పరిశోధనలో.. న్యూరోడీజెనరేటివ్ వ్యాధులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కనుగొన్నారు. ‘లేట్-లైఫ్ మూడ్ డిజార్డర్స్’గా పిలిచే జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచనా శక్తి తగ్గడం లాంటివి.. ఈ న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల ముందస్తు హెచ్చరికలు కావచ్చని వారు అంటున్నారు. ఈ పరిశోధన కోసం మొత్తం 99 మందిని ఎంపికచేశారు. వీరిలో 47 మంది పూర్తి ఆరోగ్యవంతులు కాగా.. 52 మంది లేట్-లైఫ్ మూడ్ డిజార్డర్స్ బాధితులు.
ఈ సందర్భంగా అధునాతన ‘బ్రెయిన్ ఇమేజింగ్’ పద్ధతులను ఉపయోగించి.. వీరి మెదడు నియంత్రణలను పరిశీలించారు. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కాన్ సాయంతో.. టౌ ప్రొటీన్, అమిలాయిడ్ బీటా ప్రొటీన్ ఉనికిని అన్వేషించారు. వీటితోపాటు 208 శవపరీక్ష కేసుల నుంచి మెదడు కణజాల నమూనాలను విశ్లేషించారు. వారి జీవిత చివరి మానసిక స్థితి లక్షణాలు, న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల అభివృద్ధి మధ్య సంబంధాన్నీ పరిశీలించారు. వీటన్నిటినీ విశ్లేషించిన పరిశోధకులు.. లేట్-లైఫ్ మూడ్ డిజార్డర్స్ బాధితుల్లో దాదాపు 50 శాతం మంది మెదళ్లలో ‘టౌ ప్రొటీన్’ అసాధారణరీతిలో ఉన్నట్లు గుర్తించారు. అదే ఆరోగ్యకరమైన వారిలో కేవలం 15 శాతం మందిలోనే ఈ లక్షణం బయటపడిందట. ఈ మార్పు.. అనేక రకాలైన న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల లక్షణమని అంటున్నారు.
ఇక లేట్-లైఫ్ మూడ్ డిజార్డర్స్ బాధితుల్లో దాదాపు 29 శాతం మందిలో అమిలాయిడ్ బీటా కనిపించగా.. ఆరోగ్యవంతుల్లో కేవలం 2 శాతం మాత్రమే ఈ ప్రొటీన్ ఉన్నట్టు గుర్తించారు. శవపరీక్షల ఫలితాల్లోనూ జీవితం చివరి దశలో డిప్రెషన్‌ను అనుభవించిన వ్యక్తులలో.. టౌ ప్రొటీన్ ప్రాబల్యం ఎక్కువగా గుర్తించినట్టు పరిశోధకులు వెల్లడించారు. అల్జీమర్స్ సహా ఇతర న్యూరోడీజెనరేటివ్ వ్యాధులు మొదట్లో మానసిక లక్షణాలుగానే వ్యక్తమవుతాయని ఈ ఫలితాల ద్వారా వెల్లడైనట్లు వారు చెప్పుకొచ్చారు. ఈ అసాధారణ ప్రొటీన్ల ఉనికితో.. అల్జీమర్స్ లాంటి వ్యాధి లక్షణాలు బయటపడటానికి చాలా ఏళ్ల ముందే గుర్తించవచ్చని అంటున్నారు. చివరి దశలో వచ్చిన డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్‌ను సకాలంలో గుర్తించడం వల్ల.. మెరుగైన చికిత్స అందించి, వ్యాధిని తగ్గించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.