సుజౌ (చైనా): ఏఎఫ్సీ అండర్-17 మహిళల ఆసియా కప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్-బి చివరి మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో లెబనాన్‌ను చిత్తు చేసింది. 2005 తర్వాత ఈ టోర్నీలో మన జట్టు తొలి విజయంతో పాటు నాకౌట్ బెర్తు సొంతం చేసుకుంది.ఆట ప్రారంభమైన 6వ నిమిషంలోనే అద్భుతమైన గోల్‌తో జట్టు విజయానికి బాటలు వేసిన ప్రీతికా బర్మన్ 85వ నిమిషంలో రెండో గోల్ కొట్టింది. అల్వా దేవి (36వ ని), జోయా (72వ ని) చెరో గోల్‌తో జట్టుకు ఘన విజయం అందించారు.
గ్రూప్-బిలో భారత్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్, చైనీస్ తైపీ మధ్య జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్ ఒక్క గోల్ లేకుండా డ్రా అవ్వడంతో భారత్ మార్గం సుగమం అయింది. గోల్ డిఫరెన్స్‌లో మెరుగ్గా ఉన్న భారత అమ్మాయిలు (-1).. ఫిలిప్పీన్స్‌ను వెనక్కునెట్టి నాకౌట్ చేరుకున్నారు. సోమవారం జరిగే క్వార్టర్స్‌లో గ్రూప్-ఎ టాపర్ చైనాతో పోటీపడతారు. ఇందులో గెలిచి సెమీస్ చేరితే ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్‌నకు భారత్ అర్హత సాధిస్తుంది.