బెజ్జంకి, మే 8: అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మార్కెట్‌యార్డు సమీపంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేడు వరి, మక్కలు, పొద్దుతిరుగుడు తడిసి రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దు తిరుగుడు కొనుగోలుపై స్పష్టత లేక రైతులు మార్కెట్‌యార్డులో అరిగోస పడుతున్నారన్నారు.
పంటలు సాగుచేసిన సమయంలో సరిపడా యూరియా, రైతు భరోసా ఇవ్వక అప్పుడు ప్రభు త్వం ఇబ్బంది పెట్టిందన్నారు. పండించిన పంట చేతికి వచ్చిన తర్వాత అమ్ముకునేందుకు మళ్లీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్పందించి పొద్దు తిరుగుడు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సోమవారం మండలంలోని రైతులతో ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీబస్తాలు, లారీలు, తాలు పట్టే మిషన్లు లేవన్నారు.
సరైన వసతలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. రైతులను అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. నాయకులు, రైతులతో ఏఎస్సైఐ ఓదయ్య మాట్లాడి ధర్నా విరమింపజేశారు. సర్పంచ్ శ్రీధర్, నాయకులు లక్ష్మణ్, రాజయ్య, మహే ందర్‌రెడ్డి, రమేశ్, మహేశ్, నరేశ్, శ్రీనివాస్, లక్ష్మణ్, భూ మయ్య, అజయ్, అనిల్, దేవరాజ్, సంజీవరెడ్డి, రవి, జగ న్, రైతులు పాల్గొన్నారు.