లక్నో, ఫిబ్రవరి 10: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాష్ట్రం కశ్మీర్, కేరళ, పశ్చిమ బెంగాల్ లాగా మారిపోతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మాఫియా మళ్లీ చెలరేగుతుందని హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియో ట్వీట్ చేశారు. గురువారం యూపీలో ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ‘జాగ్రత్త.. మీరు గనుక బీజేపీకి ఓటేయకపోతే ఐదేండ్ల మా శ్రమ వృథా అవుతుంది. బీజేపీ ఓడిపోతే కశ్మీర్, కేరళ, బెంగాల్‌లా ఉత్తరప్రదేశ్ మారడానికి ఎంతో సమయం పట్టదు’ అని పేర్కొన్నారు. ఐదేండ్లలో మాఫియా, నేరస్థుల నుంచి యూపీని విముక్తం చేశామన్నారు. ‘వలస వెళ్లిన హిందువులు తిరిగి వచ్చారు’ అన్నారు.
ముస్లిం మహిళకు బీజేపీ అండ
దేశంలో ముస్లిం మహిళల హక్కులు, వారి అభివృద్ధిని అడ్డుకునేందుకు కొంతమంది కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం మహిళలు అణచివేతకు గురికాకుండా చూసేందుకు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అవసరం. త్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించాం. దీంతో వారు మా ప్రభుత్వానికి మద్దతిస్తుండడంతో ప్రతిపక్షాలు ఆందోళన పడుతున్నాయి. అయినప్పటికీ మేం ప్రతి ముస్లిం మహిళకూ అండగా ఉంటాం.
– గురువారం యూపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ