శ్రీరాంపూర్, మే 25 : మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1,3,4,5,6,7,9 వార్డుల్లో ‘పట్టా’ సంబురాలు అంబరాన్నంటాయి. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వడంతో అవధుల్లేని సంతోషాలు పెల్లుబికాయి. కార్మికులు, కార్మికేతర కుటుంబాలు ఇంటి ముందర స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అరటి మంటపాలు, ఇంటి ఎదుట రంగవల్లులు వేశారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. ఆటపాటలతో వీధులు కళకళలాడాయి. పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ వార్డులు కలియ తిరిగారు. కార్మికులతో సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వానికి, సింగరేణికి, ఎమ్మెల్యే దివాకర్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

సాయిబాబా మందిరంలో పట్టాలకు పూజలు..
శ్రీరాంపూర్ ఆర్కే-8 కాలనీలోని షిర్డీ సాయిబాబా మందిరంలో బుధవారం ప్రభుత్వం ఇస్తున్న సింగరేణి స్థలాల నివాస పట్టాల పత్రాలకు నస్పూర్ చైర్మన్ ప్రభాకర్, ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్రపాణి, కౌన్సిలర్లు కుమార్, మహేష్ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సంతోషాచారి, నాయకులు రమేశ్, బండి తిరుపతి, మహేందర్ పాల్గొన్నారు.