నేరడిగొండ, ఏప్రిల్ 18 : వేసవి కాలం దృష్ట్యా ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలుగకుండా మెరుగైన వసతులు కల్పించాలని డీఆర్డీవో కిషన్ సిబ్బందికి సూచించారు. మండలంలోని బుగ్గారం(బీ), సావర్గాం గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మధ్యాహ్నం వరకు పనులు ముగించాలని సూచించారు. అనంతరం గ్రామాల్లోని నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సర్పంచ్లు జాదవ్ కల్యాణి, జాదవ్ రేణుకాబాయి, ఏపీవో వసంత్రావ్, టీఏ సంతోష్, గ్రామస్తులు జాదవ్ వసంత్రావ్, మహేందర్ ఉన్నారు.
కూలీల సంఖ్య పెంచాలి
నార్నూర్, ఏప్రిల్ 18 : మండలంలోని గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలని ఎంపీడీవో రమేశ్ అన్నారు. మండలంలోని నడ్డంగూడ గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. కూలీల వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ జాదవ్ సచిన్ ఉన్నారు.
అందరికీ ఉపాధి కల్పిస్తాం
బజార్హత్నూర్, ఏప్రిల్ 18 : పని చేస్తామని ముందుకు వచ్చే కూలీలందరికీ ఉపాధి కల్పిస్తామని ఎంపీడీవో మహేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని కిన్నెరపల్లి, హర్కయి, బజార్హత్నూర్ గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు పని ప్రదేశంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పనుల వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఏపీవో శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు.