నిర్మల్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఎంఎస్ చదువుతున్న నిర్మల్ విద్యార్థి సాయికృష్ణ ఎట్టకేలకు రొమేనియా దేశ సరిహద్దులోకి చేరుకున్నాడు. కీవ్ నగరాన్ని రష్యా బలగాలు చుట్టుముట్టి వారం నుంచి బాంబు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడులకు భయపడి వందలాది మంది విద్యార్థులు అక్కడి బంకర్లలో తలదాచుకొని భయంభయంగా గడిపారు.
భారత ప్రభుత్వం తమను వెంటనే ఆదుకోవాలంటూ వారు సోషల్‌మీడియా ద్వారా అభ్యర్థించారు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కేంద్రం అధికారులకు సైతం సోషల్ మీడియా ద్వారా తమ విజ్ఙప్తులు పంపారు. స్పందించిన ఎంబసీ అధికారులు భారత విద్యార్థులందరి పూర్తి వివరాలు సేకరించారు. రోజురోజుకూ రష్యా దాడులు ఉధృతమవుతున్న నేపథ్యంలో విద్యార్థులను బంకర్ల నుంచి బయటకు తీసుకు రావడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఎట్టకేలకు వీరు అక్కడి అధికారుల సకారంతో బంకర్ నుంచి బయటకు వచ్చారు.
ఓ బస్సులో 860 కిలోమీటర్లు ప్రయాణించి, రొమేనియా సరిహద్దుకు చేరుకున్నారు. నిర్మల్‌కు చెందిన సాయికృష్ణతో పాటు మొత్తం 25 మంది విద్యార్థుల బృందం తమ ప్రాణాలను ఆర చేతిలో పెట్టుకొని కీవ్ నగరాన్ని దాటి రొమేనియాకు చేరుకోగలిగారు. ఈ బృందంలో 18 మంది విద్యార్థులు తెలంగాణకు చెందిన వారు ఉండగా, మరో ఏడుగురు ఇతర రాష్ర్టాల వారు ఉన్నట్లుగా తెలిసింది. ఏక్షణంలో ఎటు వైపు నుంచి దాడులు జరుగుతాయోననే భయంతో తాము చేసిన ఈ ప్రయాణం పునర్జన్మనిచ్చిందని సాయికృష్ణ ఫోన్లో తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఇండియాకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
మంత్రి అల్లోల సహకారం మరువలేనిది
తమ కొడుకు సాయికృష్ణ కీవ్ నగరంలో చిక్కుకున్న నాటి నుంచి మేము తీవ్ర భయాందోళనతో గడిపాం. టీవీ ఛానళ్లలో కీవ్ నగరంపై జరుగుతున్న దాడుల దృశ్యాలను చూసి చాలా భయపడ్డాం. మా కొడుకు సాయికృష్ణ ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడి వెంటనే స్వదేశానికి వచ్చేలా చేయాలని దేవుళ్లను వేడుకున్నాం. మొన్న రాత్రి సాయికృష్ణ… తన తోటి విద్యార్థులతో కలిసి కీవ్ నగరాన్ని దాటి రొమేనియా సరిహద్దులోకి చేరుకున్నట్లు సమాచారం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నాం. మా కొడుకును రప్పించేందుకు అన్ని రకాలుగా సహకరించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
సాయికృష్ణ తల్లిదండ్రులు గణప్రసాద్, వనజ