బేల, మార్చి 2 : ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని నందీశ్వర ఆలయంలో బుధవారం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జుగ్నకే వంశస్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన దర్బార్ సభలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు జోగు రామన్నను శాలువాతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసులు నిర్వహించుకునే పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. నియమ నిష్టలతో చేసుకుంటారన్నారు. బేల నందీశ్వర ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా బ్రిడ్జి పనులు చేపట్టినట్లు చెప్పారు. సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు.
డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రె, నాయకులు సతీశ్ పవార్, ప్రమోద్ రెడ్డి, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి, దేవన్న, సంతోష్, తన్వీర్ ఖాన్, సర్పంచ్ లక్ష్మీబాయి, ఉపసర్పంచ్ దంతెల వినోద్, ఆశన్న, జుగ్నకే వంశస్థులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని బాది నందీశ్వర ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటిని సరఫరా చేశారు. కల్కీ సేవా సంఘం ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో అమ్మభగవాన్ భక్తులు ఏర్పాటు చేసిన వాహనాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు.
పలు ఆలయాల్లో ఎమ్మెల్యే పూజలు
జైనథ్, మార్చి 2 : మండలంలోని కొరాట శివాలయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పూజలు నిర్వహించారు. పెండల్వాడ ఆత్మలింగ ఆంజనేయస్వామి, జైనథ్, లక్ష్మీపూర్లోని శ్రీ మార్కండేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులను శాలువాలతో సన్మానించారు. డీసీసీబీ చైర్మన్ అడ్ఢి భోజారెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు ఎస్.లింగారెడ్డి, తుమ్మల వెంకట్రెడ్డి, సురేశ్, దేవన్న, మహేశ్, రాములు, గంగన్న పాల్గొన్నారు.