చెన్నూర్, మార్చి 2 : చెన్నూర్ పట్టణాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసి సిద్దిపేట, సిరిసిల్లల సరసన చేర్చుతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషి చేస్తున్నారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈ మేరకు స్థానిక జలాల్ పెట్రోల్ బంక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ప్రధాన రహదారి అభివృద్ధి కోసం రూ. 15 కోట్లు మంజూరు చేయించారు.
ఈ నిధులతో ప్రధాన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఇరువైపులా మురుగు కాలువలు, డివైడర్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణంతో పాటు జంక్షన్ల సుందరీకరణ పనులు చేపడుతున్నారు. మొదటి దశలో జలాల్ పెంట్రోల్ పంపు నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సెంట్రల్ లైటింగ్ సిస్టంను ప్రారంభించి పట్టణ ప్రజలకు అంకితం చేశారు. ప్రస్తుతం ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పట్టణం మెరిసిపోతున్నది. త్వరలో అంబేద్కర్ చౌరస్తా వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రధాన కూడళ్లలో సుందరీకరణపనులు, ఫౌంటెయిన్లు, నాలుగు లేన్ల తారు రోడ్డు, ఫుట్పాత్లవంటివి నిర్మిస్తుండగా పట్టణానికి మణిహారంగా నిలువనున్నాయి. పట్టణంలోని పెద్ద చెరువు, కుమ్మరికుంటలను మినీ ట్యాంకు బండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతుండగా, త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పట్టణ నడిబొడ్డున నిర్మిస్తున్న కేసీఆర్ పార్కు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. నూతన ప్రభుత్వ దవాఖాన భవనం, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ భవనం, అంబేద్కర్ స్టడీ సెంటర్ భవన నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో వీటన్నిటినీ పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
చెన్నూర్ పట్టణాన్ని ఆదర్శంగా నిలుపుతా..
ప్రజల సహకారంతో చెన్నూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతా. సిద్దిపేట, సిరిసిల్ల పట్టణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తా. ఇప్పటికే పట్టణంలో పలు అభివృద్ధి పనులు శర వేగంగా సాగుతున్నాయి. త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తా. 50 ఏండ్ల ముందు చూపుతో నిర్మాణాత్మక అభివృద్ధికి కృషి చేస్తున్నా. నియోజకవర్గంలోని చెన్నూర్, మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలను అభివృద్ధి చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు రహదారులు, పలు వాగులపై వంతెనలు నిర్మిస్తాం. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు నీరు అందేలా చూస్తా. త్వరలో ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చనుంది.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్
మా విప్‌కు థ్యాంక్స్..
చెన్నూర్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి విస్తరణ పనులతో పాటు పెద్ద చెరువు, కుమ్మరికుంటలను మినీ ట్యాంకు బండ్లుగా మారుస్తున్నారు. ప్రభుత్వ దవాఖానకు కొత్త బిల్డింగ్ నిర్మిస్తున్నారు. కేసీఆర్ పార్కు, ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మాణంతో పాటు అంబేద్కర్ స్టడీ సెంటర్‌కు కొత్త భవనం కడుతున్నారు. ఇందుకు మా విప్ బాల్క సుమన్‌కు థ్యాంక్స్.
– వంగళ సమ్మయ్య, చెన్నూర్
సెంట్రల్ లైటింగ్ బాగుంది
చెన్నూర్ పట్టణంలో ఏర్పాటు చే సిన సెంట్రల్ లైటింగ్ సిస్టం బాగుంది. మొదటి దశలో జలాల్ పెట్రోల్ బంక్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు పూర్తి చేశారు. ఇది వరకు చిమ్మచీకటితో ఉన్న ప్రధాన రహదారి ఇప్పుడు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కొత్తగా కనిపిస్తున్నది. చెన్నూర్ పట్టణం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్నందుకు ఆనందంగా ఉంది.
– గడ్డం ప్రశాంత్, చెన్నూర్