– బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సంకుబాపన అనుదీప్
రుద్రంపూర్, అక్టోబర్ 05 : ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కేంద్రాన్ని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు సంకుబాపన అనుదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమైనదన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సంబంధించిన ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేసేందుకు గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. “గ్రాడ్యుయేట్ ఓటు కేవలం ఓటు మాత్రమే కాదు.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ప్రజాస్వామ్య హక్కులో ఒక ముఖ్యమైన సాధనం” అని ఆయన అన్నారు.
అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అనుదీప్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బానోత్ రాందాస్, గుమ్మడి సాగర్, పూల రవీందర్, బోనగిరి శ్రీకాంత్, అలాగే బావు సతీష్, రామంచి శ్రీనివాస్, కళాకోటి ఐలయ్య, తాతారావు, బేతాళ కుమార్ పాల్గొన్నారు.