Aadarsha Kutumbam | విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా పడింది. కొంతకాలంగా ఈ సినిమా విడుదలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. తాజాగా నిర్మాత నాగవంశీ అధికారికంగా స్పందించి వాయిదా విషయాన్ని వెల్లడించారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ఆసక్తి నెలకొంది. ‘ఆదర్శ కుటుంబం’ విడుదల వాయిదా వేయడానికి ప్రధాన కారణం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడమేనని నిర్మాత నాగవంశీ తెలిపారు. కొన్ని సాంకేతిక పనులు మరో నాలుగైదు రోజులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయడం కంటే.. పూర్తి నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మంచిదని చిత్రబృందం నిర్ణయించినట్లు చెప్పారు.
సినిమా అవుట్‌పుట్‌పై టీమ్ పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నామని నాగవంశీ వెల్లడించారు. సినిమా కాపీ చూసిన తర్వాత టీమ్ అంతా సంతృప్తిగా ఉందని భావించినప్పుడే విడుదల చేస్తామని, అందుకోసం కొంత సమయం తీసుకోవడం తప్పేమీ కాదని పేర్కొన్నారు. వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండటంతో ‘ఆదర్శ కుటుంబం’ విడుదల తేదీపై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. తొలుత ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రకటించారు. అయితే ఆ తేదీ నుంచి అక్టోబర్ 9కి వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి విడుదల వాయిదా పడింది.కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు. దీంతో ఈ సినిమా అక్టోబర్‌లోనే వస్తుందా? లేక మరింత ముందుకు వెళ్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రమిది కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై అభిమానుల్లో మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలో వెంకటేశ్ చిట్టిబాబు అనే మధ్యతరగతి వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. ఆయన భార్యగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. నివేదా పేతురాజ్, నారా రోహిత్, రావు రమేశ్, రఘుబాబు, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.