Bandla Ganesh | ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ తాజా పోస్టు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తన పేరును అనవసరమైన ప్రచారాలకు, చర్చలకు ఉపయోగించవద్దంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితానికి ఇబ్బందులు కలిగించేలా తన పేరును ఉపయోగించొద్దని చేతులెత్తి వేడుకున్నారు. సోమవారం సోషల్ మీడియాలో స్పందించిన బండ్ల గణేశ్.. తనకు ఎలాంటి పదవులు, హోదాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. తన పేరు చుట్టూ జరుగుతున్న చర్చలు, ప్రచారాల వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన పోస్టు ద్వారా చెప్పుకొచ్చారు.
దయచేసి మీ టైమ్‌పాస్ కోసం నా పేరు వాడి, నా జీవితానికి అన్యాయం చేయొద్దని చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంటూ బండ్ల గణేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. తనకు ఎలాంటి పదవుల మీద కానీ, హోదాల మీద కానీ వ్యామోహం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా మరే ఇతర విషయాలపైనా తనకు ఎలాంటి ఆశలు లేవని ఆయన తెలిపారు. లేనిపోని విషయాలు మాట్లాడి తన పేరును ఉపయోగించడంతో తనకు ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరారు.
అయితే బండ్ల గణేశ్ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. ఆయన తన పోస్టులో ఎవరిపేరును ప్రస్తావించలేదు. దీంతో ఆయన తాజా వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తనకు పదవులు, హోదాలపై ఆసక్తి లేదని ప్రత్యేకంగా చెప్పడంతో.. ఆయన రాజకీయ లేదా ఇతర పదవులకు సంబంధించిన ప్రచారాలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే దీనిపై బండ్ల గణేశ్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సాధారణంగా సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించే బండ్ల గణేశ్.. ఈసారి మాత్రం చాలా భావోద్వేగంగా తన అభ్యర్థనను వెల్లడించడం గమనార్హం. “నా జీవితానికి అన్యాయం చేయొద్దు” అంటూ ఆయన చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తడ