ఆదిలాబాద్ రూరల్, మార్చి 2 : మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బంగారిగూడ ఎంపీపీఎస్ పాఠశాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఉపాధ్యాయులు, కాలనీ వాసులతో పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు మెరుగుపడినప్పుడే మరింత ఆర్థికాభివృద్ధి సాధించగలుగుతామని అన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి 30 శాతం పాఠశాలలను అభివృద్ధి చేయడానికి నిర్ణయించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే విధంగా వారి ఉన్నత చదువుకు మన బస్తీ మన బడి కార్యక్రమం మరింత తోడ్పాటుగా నిలబడుతుందని అన్నారు. పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు విరాళాలు ఇవ్వాలని సూచించారు. బంగారిగూడ పాఠశాలకు మున్సిపల్ చైర్మన్ రూ.20వేలు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు అశోక్, మున్సిపల్ ఏఈ అరుణ్, నాయకులు పాల్గొన్నారు.