ఎదులాపురం,మార్చి2: జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులకు ప్రతిపాదనలు సకాలంలో పంపాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఇంజినీరింగ్ శాఖ చేపట్టే పనులకు అటవీశాఖ అనుమతులపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధ వారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాటాడారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో పాటు ఏజెన్సీ గ్రామాల్లో చేపడుతున్న రోడ్ల నిర్మాణాలు, విద్యుత్ లైన్ పనులకు ముందస్తుగా ఆటవీ శాఖ అనుమతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలన్నారు. జిల్లా స్థాయి అధికారుల పరిధిలో పనులకు అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. మిగతా వాటికి రాష్ట్ర స్థాయి అధికారులకు ప్రతిపాదించనున్నట్లు వివరించారు. సమావేశంలో డీఎఫ్వో రాజశేఖర్, ఐటీడీఏ పీవో అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.