ఎదులాపురం,జూన్1: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 12న టెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను అదేశించారు.
ఆదిలాబాద్, ఉట్నూర్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మొదటి పేపర్‌కు 7732 మంది అభ్యర్థులు, రెండో పేపర్‌కు 3,166 మంది అభ్యర్థులు అర్హత పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షలు సాఫీగా జరిగేందుకు ఆరుగురు ఫ్లయింగ్ స్కాడ్లు, ప్రతి కేంద్రంలో 10 మంది ఇన్విజిలేటర్లు, హాల్ సూపరింటెండెంట్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించామని వివరించారు. పరీక్ష నిర్వహణకు అదనపు కలెక్టర్ సమన్వయ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. సమావేశంలో ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, డీఈవో ప్రణీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 1 : ఈ నెల 12న నిర్వహించనున్న టెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టెట్ నిర్వహణకు అన్ని శాఖలు బాధ్యాతాయుతంగా పని చేయాలని సూచించారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 7734 మంది పరీక్షకు హాజరవుతున్నారని చెప్పారు.
పేపర్ -1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ -2 మధ్యాహ్న 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుందని తెలిపారు. బోధనేతర సిబ్బంది మాత్రమే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు. టెట్ సమన్వయకర్త, డీఈవో రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్‌లో 19, భైంసాలో 10, ఖానాపూర్‌లో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 33 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 33 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 400 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. కార్యక్రమంలో పరీక్షల సహాయ కమిషనర్ పద్మ, సూపరింటెండెంట్ భోజన్న, అధికారులు ఉన్నారు.