నిర్మల్ టౌన్, ఏప్రిల్ 17 : తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నిర్మల్‌లో నిర్మించిన మోడల్ అంబేద్కర్ ఆడిటోరియ భవనం సోమవారం ప్రారంభం కానుంది. రూ.5 కోట్లతో హైదరాబాద్ తర్వాత నిర్మల్‌లో అధునాతన వసతులతో మోడల్ భవన నిర్మాణం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవతో పూర్తయింది. ఎకరం స్థలంలో ఆడిటోరియం, గదులు, సమావేశ మందిరం, ఇతర అవసరాలకు అనుగుణంగా అన్ని వసతులతో ఏసీ గదులను నిర్మించారు. ఈ భవనాన్ని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల మైనార్టీ సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తికావడంతో దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సారంగాపూర్ మండలం చించోలి(బీ)లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అ తర్వాత జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించి అక్కడ నిర్వహించే కార్యక్రమంలో మంత్రులు పాల్గొని దళితుల అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు దళిత సంఘాల నాయకులు హాజరుకావాలని మంత్రి అల్లోల కోరారు.