
హాజీపూర్, నవంబర్ 18 : ఓటరు జాబితా సవరణను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ కార్యదర్శి, మైనార్టీ సంక్షేమశాఖ, కార్మిక శాఖ కమిషనర్, మంచిర్యాల ఓటర్ల జాబితా పరిశీలకుడు అహ్మద్ నదీమ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతీ హోళికేరి , అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి ఆర్డీవోలు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 రెవెన్యూ మండలాలు, 343 గ్రామాలు, 7 మున్సిపాలిటీలు, 282 పంచాయతీలు ఉన్నాయన్నారు. చెన్నూర్‌లో 225 పోలింగ్ కేంద్రాలు, బెల్లంపల్లిలో 222, మంచిర్యాలలో 279తో కలిసి మొత్తం 726 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 308 అర్బన్, 418 రూరల్ పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. 2,96,755 మంది మహిళలు, 2,94,251 మంది పురుషులు, 45 మంది ఇతరులు, సర్వీసెస్ 603, ఎన్ఆర్వో 29 మంది ఉన్నారని తెలిపారు. ముగ్గురు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించామని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గానికి మంచిర్యాల ఆర్డీవో, బెల్లంపల్లి నియోజకవర్గానికి బెల్లంపల్లి ఆర్డీవో, చెన్నూర్ నియోజకవర్గానికి అదనపు కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ నెల 1న డ్రాప్ట్ పబ్లికేషన్ చేశామని, ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. 27, 28తేదీల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించి, డిసెంబర్ 20 వరకు దరఖాస్తులను పరిశీలించి జనవరి 5న తుది జాబితా ప్రచురణ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.