
ఆదిలాబాద్, నవంబర్ 2 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో రైతులు వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు. వానకాలం పంటల విస్తీర్ణం ఎక్కువగా ఉండేది. సరిపడా వర్షాలు పడితేగానీ పంట చేతికి వచ్చేది కాదు. గతంలో జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పంటలు నష్టపోయారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జిల్లాలోని రైతులకు సాగునీరు అందించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణాలను చేపట్టింది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 208 చెరువులకు మరమ్మతులు చేపట్టగా, 45 వేల ఎకరాల ఆయకట్టు పెరిగింది. గత ప్రభుత్వాలు జిల్లాలో పుష్కలంగా నీటిని నిల్వచేసే అవకాశాలున్నా పట్టించుకోలేదు. దీంతో వానకాలంలో వర్షాలు పడినప్పుడు నీరంతా వృథాగా పోయేది. ఫలితంగా ఎండాకాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడేవారు. వర్షపు నీరు వృథాగా పోకుండా రైతులు, స్థానికులకు ఉపయోగపడడంతో పాటు పశువులకు తాగునీరు లభించేలా ప్రభుత్వం జిల్లాలో చెక్‌డ్యాంలను నిర్మించింది.
40 చెక్‌డ్యాంలు పూర్తి..
జిల్లాకు మొదటి విడుతలో 47 చెక్‌డ్యాంలు మంజూరయ్యాయి. వర్షాకాలంలో నీటిని నిల్వచేసి రైతులకు ఉపయోగపడేలా చేపట్టిన చెక్‌డ్యాం నిర్మాణాల్లో 40 పూర్తయ్యాయి. నీటి పారుదల శాఖ ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ సబ్ డివిజన్లో వీటి నిర్మాణాలు చేపట్టారు. గ్రామాల్లో స్థానికంగా ప్రవహించే వాగులకు అడ్డంగా చెక్‌డ్యాంలు నిర్మించారు. ఆదిలాబాద్ సబ్‌డివిజన్‌లో రూ.30 కోట్లతో 15 చెక్‌డ్యాంలు నిర్మిస్తుండగా, ఇచ్చోడ సబ్‌డివిజన్‌లో రూ.34 కోట్లతో 17 చెక్‌డ్యాంలు, ఉట్నూర్ సబ్‌డివిజన్‌లో రూ.30 లక్షలతో 15 చెక్‌డ్యాంలను నిర్మిస్తుండగా.. 40 పూర్తయ్యాయి.
8 వేల ఎకరాలకు సాగునీరు..
వానకాలంలో కురిసిన వర్షాలతో చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. ఈ చెక్‌డ్యాంల ద్వారా ఈ యాసంగిలో 8 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నారు. మోటర్ల ద్వారా నీటిని తీసుకొని స్ప్రింక్లర్ల ద్వారా పంటలకు పెడుతున్నారు. సర్కారు అందించిన సాయంతో తాము రెండో పంట సాగు సాగుచేసుకొనే అవకాశం లభించిందని రైతులు అంటున్నారు. చెక్‌డ్యాంలతో భూగర్భ నీటిమట్టం పెరిగి ఎండాకాలంలో స్థానికులకు తాగునీటి సమస్య కూడా తీరనుంది. పశువులకు సైతం తాగునీరు పుష్కలంగా లభించనుంది.
సాగు నీటికి ఢోకా లేదు
నాకు ఐదెకరాల భూమి ఉంది. వానకాలంలో పత్తి, కంది వేసిన. మరో 15 రోజుల్లో పంట చేతికస్తది. ఈ యాసంగిలో శనగ, గోధుమ వేస్తా. మా ఊరి వాగులో ఏటా నీరు వట్టిగా పోతుంది. సర్కారోళ్లు ఇక్కడ చెక్‌డ్యాం నిర్మించిన్రు. ఇగ మాకు ఢోకా లేదు. రెండు పంటలకూ నీరందుతది.