
నార్నూర్, నవంబర్ 2 : ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలు గొప్పవని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని జామడ గ్రామంలో మంగళవారం నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీవో అంకిత్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. వీరికి ఆదివాసులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఏత్మాసూర్ దేవతకు పూజలు చేశారు. శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రాయిసెంటర్ జిల్లా సార్మేడి మెస్రం దుర్గుపటేల్ పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉండే పిల్లలకు ఇప్పపువ్వు లడ్డూ తినిపించాలని, గిరి పోషణ్ ద్వారా చిరు ధాన్యాలు అందజేస్తున్నట్లు తెలిపారు. సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని, 18 ఏండ్లు నిండిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. గిరి గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. ఆ తర్వాత పీవో అంకిత్ మాట్లాడుతూ.. రూ.కోటితో గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. త్వరలోనే ఇప్పపువ్వు లడ్డూ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. అనంతరం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే పండుగలకు గుర్తింపు లభిస్తున్నదన్నారు. దండారీ ఉత్సవాలకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఎంపీపీ కనక మోతుబాయి, సర్పంచ్ మడావి ముక్తారూప్దేవ్, ఐటీడీఏ డీడీ సంధ్యారాణి, తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్, మండల ప్రత్యేకాధికారి శ్రీనాథ్, ఎంపీడీవో రమేశ్, సీడీపీవో శారద, ఏపీవో జాదవ్ శేషారావ్, ఇంద్రవెల్లి మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ నాగోరావ్, ఆయాశాఖల అధికారులు ఉన్నారు.
కొలాం కొటారి గ్రామంలో..
కెరమెరి, నవంబర్ 2 : మండలంలోని కొలాం కొటారి గ్రామంలో దండారీ వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డితో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ పాల్గొన్నారు. ముందుగా ఏత్మాసూర్ పేన్కు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలతో కలిసి స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలు ఆకట్టుకునేలా ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని, భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీపీ పెందోర్ మోతీరాం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొటారి సర్పంచ్ గుణవంత్‌రావ్, నాయకులు కుమ్రం భీం రావ్, ఆదివాసులు పాల్గొన్నారు.