జైనథ్, మార్చి 28 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు పార్టీలో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆనంద్‌పూర్ గ్రామంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే జోగు రామన్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత విద్యుత్, పల్లె పార్కులు, డంప్‌యార్డులు ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్‌పై ఎంపీ సోయం బాపురావు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు చేసి, జన్ ధన్ఖాతాలు ఉన్న మహిళల అకౌంట్ల్లో రూ.15 లక్షలు వేస్తామని, నిరుద్యోగులకు సంవత్సరానికి కోటి చొప్పున ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. అనంతరం జైనథ్ శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో రూ.50లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, సర్పంచ్ దేవన్న, ఆలయ కమిటీ చైర్మన్ పుండ్రు వెంకట్‌రెడ్డి, నాయకులు చంద్రయ్య గణేశ్‌యాదవ్, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, మార్చి 28 : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కో ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా మూడు చక్రాల వాహనాలు 2 ల్యాప్‌టాప్‌లు, 4జీ ఫోన్లు దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, నాయకులు పాల్గొన్నారు.